ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దర్శకుల కొడుకులు దర్శకత్వంవైపే అడుగులు వేసేవారు (ఉదాహరణకు రాఘవేంద్ర రావు). నిర్మాతల కొడుకులు నిర్మాతలుగా ఉండేందుకే ఇష్టపడేవారు (ఎగ్జాంపుల్ మల్లెమాల బ్యానర్.. ). హీరోల కొడుకులు మాత్రం హీరోలుగా తమ సత్తా చూపేవారు. అయితే ఆ తర్వాతి కాలంలో హీరోలే కాదు దర్శకులు, నిర్మాతలు, సహాయ నటులు, ఇలా అందరి వారసులు హీరోలుగానే అడుగులు వేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. కుటుంబంలో ఎంతమంది ఉంటే, అంతమంది కూడా హీరోలుగానే చలామణి కావాలనుకుంటున్నారు.

ఒకే ఫ్యామిలీనుంచి వరుసబెట్టి హీరోలు వస్తే.. జనాలు ఎరిని ఆదరిస్తారు. పోనీ అన్నదమ్ములే అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఎవరిని సక్సెస్ వరిస్తుంది. దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో వారసులుగా అడుగు పెట్టిన అన్నదమ్ములిద్దరూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ తమ్ముడు అనే ట్యాగ్ ఉన్నా.. చిరంజీవి స్వయంకృషితో వచ్చారు కాబట్టి మెగా బ్రదర్స్ కి ఆ మినహాయింపు ఉంది. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలో కృష్ణ నటవారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరూ తెరపైకి వచ్చారు. వీరిలో మహేష్ మాత్రమే సూపర్ స్టార్ గా సక్సెస్ అయ్యారు, రమేష్ బాబు కొన్నాళ్ల తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు పూర్తిగా తెరమరుగయ్యారు.

నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ కొడుకులు కొంతమంది హీరోలుగా మారినా, బాలకృష్ణ మాత్రమే నిలదొక్కుకోగలిగారు. ఆ తర్వాతి తరంలో ఎన్టీఆర్ దూసుకెళ్తుండగా.. కల్యాణ్ రామ్ కాస్త స్లో అయ్యారు. దగ్గుబాటి రామానాయుడు వారసులుగా వెంకటేష్ నటనను ఎంచుకుంటే, సురేష్ బాబు మాత్రం నిర్మాతగానే సెటిలయ్యారు. మంచు ఫ్యామిలీలో విష్ణు ఒకటీ అరా హిట్స్ తో పోరాటం చేస్తుండగా.. మనోజ్ మాత్రం బాగా నెమ్మదించారు. అల్లువారి ఫ్యామిలీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెలరేగిపోతుండగా.. ఆయన తమ్ముడు శిరీష్ హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతున్నారు. ఇక రవితేజ తమ్ముళ్లు కూడా హీరోలయ్యారు కానీ ఫలితం లేదు. హీరో కమ్ కమెడియన్ అలీ తమ్ముళ్లు కూడా నటనలో పెద్దగా రాణించలేకపోయారనే చెప్పాలి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫ్యూచర్ స్టార్ హీరో అనిపించుకోగా.. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండకి ఆ స్థాయి హీరో అయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు, ఫ్యూచర్ లో వీరిద్దరిలో ఎవరు బాగా సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు వారసత్వాన్ని నాగార్జున నిలబెడితే.. ఆయన వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే హీరోగా సూపర్ సక్సెస్ సాధిస్తాడనుకున్న అఖిల్ మాత్రం హిట్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. టాలీవుడ్ సెంటిమెంట్ అఖిల్ ని కాస్త వెనక్కు లాగుతోంది.

దాదాపుగా హీరోలుగా మారిన అన్నాదమ్ముల్లో ఎవరో ఒకరే బాగా సక్సెస్ అవుతున్నారు. రెండోవారు పూర్తిగా తెరమరుగైపోయిన సందర్భాలున్నాయి, లేదా సినిమాలతోనే కాలక్షేపం చేస్తున్న ఉదాహరణలూ ఉన్నాయి. టాలీవుడ్ లో వారసుల సెంటిమెంట్ ఇలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: