ప్రస్తుతం దేశంలో కరోనా దెబ్బకి ప్రతి ఒక్కరు తమ తమ పద్ధతులు మార్చుకోవాల్సి వచ్చింది. సామాజిక దూరం, అనవసరంగా బయటకు రావడం ఇలా ఎన్నో విధాలుగా మారాయి. అయితే కొందరు స్టార్లు మరో అడుగు ముందుకేశారు. వారు సామాజిక మాధ్యమాలకు కూడా దూరం పాటిస్తున్నారు. సాధారణంగా ప్రతి స్టార్ కూడా సోషల్ మీడియా ద్వారానే తమ అభిమానులకు చేరువగా ఉంటారు. తమ గురించి అనేక విషయాలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు.

 అంతేకాకుండా తమ సినిమాల అప్‌డేట్‌లను తెలుపుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. కానీ బాలీవుడ్ స్టార్స్ కొందరు మాత్రం సోషల్ మీడియాకు దూరం దూరంగా ఉంటున్నారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఉన్నారు. కావాలంటే ఆమిర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంటే ఓసారి చెక్ చేసుకోండి. అది కచ్చితంగా అతడి ఖాతా అయి ఉండదు. ఎందుకంటే ఈ ఏడాది మార్చి 14న ఆమిర్ పుట్టినరోజు సందర్భంగా తను సోషల్ మీడియాకు శాశ్వతంగా దూరమవుతున్నాని ప్రకటించాడు.

 దానికి కారణాలు వివరించలేదు కాని, వాటి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే మరికొందరు స్టార్లు తమ ఖాతాలను డిలీట్ చేయలేదు గాని దూరం మాత్రం పాటిస్తూ, కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారిలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ వరీనా హుస్సేన్‌లు ఉన్నారు. అయితే దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఊసుపోని కబుర్లు, జిమ్ వర్కౌట్ వీడియోలు పోస్ట్ చేయడం వంటి అర్థరహిత పనులు ఎవరికీ వినోదాన్ని ఇవ్వవని, ఎవ్వరి బాధను తగ్గించలేవని అమితాబ్ అన్నారు.

 అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో మాల్దీవులకు, ఇతర విహార యాత్రలకు వెళ్లి ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారినీ తప్పుబట్టారు. మరికొందరైతే ఎవ్వరికీ చెప్పకుండా సామాజిక మాధ్యమాలకు దూరం పాటిస్తున్నారు. ఇక వరీనా హుస్సేన్ ఇకపై తన సోషల్ మీడియా ఖాతాలను తన టీమ్ చూసుకుంటుందని తెలిపారు. ఇలా తమ సోషల్ మీడియాకు దూరం పాటిస్తున్న తారల్లో జాన్ అబ్రహం, ఫాతిమా సన షైక్, ఈషా గుప్తా తదితరులు ఉన్నారు.

 వీరంతా కూడా తమ అధికారిక ఖాతాలను తమ టీమ్‌కి అప్పజెప్పి వారు బ్రేక్ తీసుకున్నారు. ఇక మరికొందరు కూడా సామాజిక మాధ్యమాలకు దూరం పాటిస్తున్నారు. హీరోయిన్ సోనాక్షి సిన్హా, హీరో ఆయుష్ శర్మ, దర్శకుడు శశాంక్ ఖైతన్, సుపీత్ సర్కార్‌లు ఈ జాబితాలో చేరారు.  ఇందులో మునుముందు ఇంకెందరు చేరతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: