బుల్లితెరపై ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజు ఓ ట్విస్ట్ తో కొనసాగే ఈ కథ టీఆర్పీలో సైతం నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. తాజాగా కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల ఆలీతో సరదాగా షోకు విచ్చేశారు. ఈ షో లో ఆయన తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఆలీతో పంచుకున్నారు. తన ప్రేమ, పెళ్లి అలాగే తన కెరీర్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. 


మరీ ముఖ్యంగా ఆయన సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా రాణించాలని అని కెరీర్ మొదట్లో భావించానని చెప్పుకొచ్చాడు. అలా ఆయన మొదట అష్టా చెమ్మా సినిమా కోసం ఆడిషన్ కు వెళ్లానని తెలిపారు. అప్పటికే తాను సీరియల్స్ చేస్తున్నానని అన్నాడు. రేపు ఆడిషన్ చేయాలి అంటూ ఒక సీన్ కూడా ఇచ్చారని, కానీ తర్వాత రోజు వెళితే వద్దని చెప్పారు అని చెప్పుకొచ్చాడు. అంటే ఆ ముందు రోజు సాయంత్రం తను చేస్తున్న సీరియల్ చూశారని సీరియల్ లో చేస్తున్న కారణంగా తనను వద్దని అనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 


నిరుపమ్ ను కనీసం ఆడిషన్ కూడా చేయకుండానే ఆయన స్థానంలో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి వచ్చిన నానిని హీరోగా తీసుకున్నారట. ఆ దెబ్బతో నాని సుడి తిరిగింది అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ రోజు సినిమాకు 10 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడు అంటే అది కచ్చితంగా ఆయన పడ్డ కష్టమే. అయితే నానికి మొదటి సినిమా అవకాశం దక్కడానికి మాత్రం నిరుపమ్ సీరియల్ చేయడమే కారణం అని చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: