హీరో, హీరోయిన్లు.. పగలు-రాత్రి లాంటి వారు. ఒకే గదిలో హీరో పగలుంటే.. రాత్రి హీరోయిన్ ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అది నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. స్వాతి ప్రత్రికతో మొదలైన సున్నితమైన ప్రేమ.. ఆ పత్రిక సాయంతోనే వారిని ఒక్కటి చేస్తుంది. ఇంతటి విచిత్రమైన వైవిధ్యమైన కథను, చక్కటి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ వంశీ. తన మార్క్ డైరెక్షన్, కామెడీతో సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్ది మరోసారి తన గొప్పతనం నిరూపించుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో చెప్పలేదు కదూ.. రవితేజ, కల్యాణి కలిసి నటించిన ‘ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’. 2002లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ క్లాసికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. రవితేజకి హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ.. ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండానే.. ఇరువురి ఇష్టాఇష్టాలను ఒకరికి ఒకరు గౌరవించుకోవడం, తమను తాము మార్చుకోవడం, చివరికి ప్రేమలో ఉన్నామని తెలుసుకుని ఒక్కటి కావడం.. ఇలా సినిమాలో ఓ చక్కటి సున్నితమైన ప్రేమను డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు. ఇక హీరోహీరోయిన్ల పాత్రల్లో రవితేజ, కల్యాణిలు కూడా చాలా చక్కగా ఇమిడిపోయారు. సహజంగా అనిపించే వారి నటన సినిమాకు మరో ప్లస్ పాయింట్.

ఇక సినిమాలో లవ్ ట్రాక్‌తో పాటు వంశీ మార్క్ కామెడీ కూడా ఉంటుంది. కాలనీలోని ప్రతి ఒక్కరితో హాస్యం పండించాడు డైరెక్టర్. డబ్బుల కోసం ఒకే గదిని ఇద్దరికి అద్దెకిచ్చి వారిద్దరూ కలవకుండా కాపాడే పాత్రలో సత్యానందం(జీవా), తన వింత ప్రవర్తనతో సత్యానందాన్ని ఇబ్బందులు పెడుతూ  ఉండే బావమరిది(కృష్ణ భగవాన్) ప్రేక్షకులను తెగ నవ్విస్తారు. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మల్లికార్జునరావు కాలనీలో అందరికీ ఐడియాలు అమ్ముతూ ఉంటాడు. పొట్టిరాజు (కొండవలస లక్ష్మణరావు) భార్య దగ్గర మెప్పు పొందాలని రకరకాల వ్యాపారాలు చేసి ఏవీ కుదరక భార్య చేత చీవాట్లు తింటుంటాడు. అందుకే ఇప్పటికీ ఈ సినిమా ఓ క్లాసికల్ హిట్‌గా ప్రజల మదిలో నిలిచిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: