ఛార్మి కౌర్ సినిమాల్లో నటించినంత కాలం తన అందచందాలతో ప్రేక్షకులకు మతులు పోగొట్టారు. సినిమా నిర్మాతగా అవతారం ఎత్తిన తర్వాత నటనకు గుడ్ బై చెప్తున్నానని ప్రకటించి ఎందరో అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. ఆమె తన కెరీర్ మొత్తంలో 40 సినిమాల్లో నటించగా.. పలు సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనకు పలు పురస్కారాలు దక్కాయి. ఈరోజు ఛార్మి పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఏ ఏ సినిమాలకు ఏ ఏ పురస్కారాలు దక్కించుకున్నారో తెలుసుకుందాం.


2007లో వచ్చిన మంత్ర సినిమా లో ఛార్మి టైటిల్ రోల్లో చాలా బాగా నటించారు. ఆమె పర్ఫామెన్స్ కి ఉత్తమ నటీమణిగా నంది అవార్డు కూడా లభించింది. తులసి రామ్ దర్శకత్వం వహించిన మంత్ర సినిమా 2007వ సంవత్సరంలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మహా మహా పాటలో ఛార్మి వేసిన డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. ఛార్మి కౌర్ మనోరమ, కావ్యాస్ డైరీ, మంగళ సినిమాలో వైవిధ్యమైన నటనా చాతుర్యాన్ని కనబరిచి రాష్ట్రస్థాయి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు దక్కించుకున్నారు. మాస్ చిత్రంలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించిన ఆమె బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డ్ కి నామినేట్ అయ్యారు. అనుకోకుండా ఒక రోజు చిత్రంలో ఆమె అద్భుతమైన నటనా ప్రదర్శన కనబరిచి సంతోషం బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు. జ్యోతిలక్ష్మి సినిమాలో ఆమె నటనకు "సిని'మా' బెస్ట్ యాక్ట్రెస్" అవార్డు లభించింది. ఆమె ఉత్తమ నటీమణిగా చాలా అవార్డులకు నామినేట్ అయ్యారు.



అయితే ఛార్మి ఒక గొప్ప నటి మాత్రమే కాదు ఆమె ఒక అద్భుతమైన డాన్సర్ కూడా. ఆమె పౌర్ణమి సినిమా లో భరత నాట్యం చేసే నృత్యకారిణిగా నటించారు. భరత వేదముగా పాటలో ఆమె చేసిన నాట్యం అందర్నీ ఫిదా చేసింది. జ్యోతిలక్ష్మి, నాయక్ వంటి పలు చిత్రాల్లో కూడా ఆమె అద్భుతమైన నాట్యం చేసి గొప్ప నాట్యకారిణి గా పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆమె ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్. అలాగే ఆమె స్విమ్మింగ్ లో కూడా బాగా రాణించారు. బాలీవుడ్ లో కూడా తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: