న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా వ‌స్తుందంటే ఆయ‌న అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చిన‌ట్లే. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందునుంచే ప‌ట్ట‌ణం, ప‌ల్లెలు అనే తేడాలేకుండా ఆయ‌న ఫ్యాన్స్ హ‌డావుడి అంతాఇంతాకాదు. సినిమా విడుద‌ల రోజు థియేట‌ర్‌ల వ‌ద్ద చిన్న‌పాటి జాత‌ర‌ను త‌ల‌పిస్తుంది. బాల‌య్య న‌టించిన సినిమాల్లో రికార్డులు కొల్ల‌గొట్టిన సినిమాలు ఉన్నాయి. అదే క్ర‌మంలో ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ఒక్క మ‌గాడు సినిమా. నంద‌మూరి వంశ వీరాభిమాని వై.వి.ఎస్ చౌద‌రి ఈ సినిమాను తెర‌కెక్కించారు. 2008లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా అభిమానుల‌ను నిరాశ‌ప‌ర్చి వారంరోజుల్లోనే థియేట‌ర్ల వ‌ద్ద చాప‌చుట్టేసింది.

ఒక్క మ‌గాడు సినిమా విడుద‌ల‌కు ముందు టాలీవుడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని వై.వి.ఎస్ చౌద‌రి, చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొంటూ వ‌చ్చారు. ఈ సినిమాకు ముందు బాలకృష్ణ అభిమానుల పోస్టర్లు పెద్దఎత్తున ఊరూరా వెలిశాయి. ఈ పోస్టర్లలో సినిమా అభిమానం, స్థానిక రాజకీయం, కులాభిమానం ఛాయలు కనిపించడం విశేషం. భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఒక్క మ‌గాడు సినిమా భారీ ప్లాప్‌ను మూట‌గ‌ట్టుకోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వై.వి.ఎస్ చౌద‌రి క‌థ‌ను స‌రిగా ఎంచుకోలేదని, ఆయ‌న తీసిన విధానం అస్స‌లు బాగోలేద‌ని సినీ విశ్లేష‌కులు పేర్కొన్నారు. మేక‌ప్‌, గ్రాఫిక్స్, సాంకేతిక విలువ‌ల‌ను ప‌ట్టించుకున్నంత‌గా క‌థ‌ను ప‌ట్టించుకోలేదు. ఈ చిత్రంలో హీరో పాత్ర న‌ర‌సింహ‌నాయుడు, భార‌తీయుడు అనే రెండు సినిమాల హీరో పాత్ర‌ల‌ను పోలి ఉండ‌టం సినిమా ప్లాప్‌కు ఓ కార‌ణం.

ఈ సినిమాలో భారీ తారాగ‌నం ఉంది. బాల‌య్య ప‌క్క‌న సిమ్రాన్‌తో పాటు అనుష్క‌శెట్టి, నిషా కొఠారి హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ న‌ట‌న ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. అనుష్క‌, నిషా కొఠారి బాలయ్య స‌ర‌స‌న చ‌క్క‌గా స‌రిపోయిన‌ప్ప‌టికీ.. విల‌న్ ఆసుతోష్ రాణా పాత్ర చిత్రీక‌ర‌ణలో చౌద‌రి పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ సినిమాలో బాల‌య్య చెప్పిన భారీ డైలాగులు ఆయ‌న అభిమానుల‌కు కొంత ఉత్సాహాన్ని ఇచ్చాయి. పాటల చిత్రీక‌ర‌ణ ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌టంతో బాల‌య్య అభిమానుల‌ను ఒక్క మ‌గాడు సినిమా తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో బాల‌య్య సినిమా కావ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ వై.వి.ఎస్ చౌద‌రి బాల‌య్య ఇచ్చిన అవ‌కాశాన్ని స‌రిగా వినియోగించుకోలేక పోయాడు. ఫ‌లితంగా ఒక్క మ‌గాడు భారీ ప్లాప్‌ను మూట‌గ‌ట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: