సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సుడిగా రాజ‌కుమారుడు చిత్రంతో తెరంగేట్రం చేసిన మ‌హేష్‌బాబుకు తాను కూడా బిగ్ స్టార్ అనిపించుకోవడానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. తొలిద‌శ అంత సాఫీగా ఏమీ సాగ‌లేదు. మొద‌టి సినిమాయే ఘ‌న‌త వ‌హించిన అశ్వ‌నీద‌త్ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట‌ర్‌. 1999 జూన్‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌య‌మే సాధించింది. ఇక ఆత‌రువాత మ‌హేష్ కెరీర్ న‌ల్లేరుపై న‌డ‌క‌లా ఏమీ సాగ‌లేదు. ప‌రాజ‌యాలూ ప‌ల‌క‌రించాయి. రెండో మూవీ సొంత బ్యాన‌ర్ ప‌ద్మాల‌యా నిర్మించిన వంశీ. న‌మ్ర‌తా శిరోద్క‌ర్ హీరోయిన్‌. అప్ప‌టికి విజ‌యాల ఊపుమీదున్న బి. గోపాల్ డైరెక్ట‌ర్‌. 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌ల ముందుకువ‌చ్చిన‌ ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అదే ఏడాది వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యువ‌రాజు ఒక మోస్త‌రు విజ‌యాన్ని అందుకున్నా మ‌హేష్ కెరీర్‌కు ఊపు తేలేక పోయింది. తొలిసారిగా మ‌హేష్‌లోని న‌ట‌న‌ను వెలికితెచ్చి ఆయ‌న‌ను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసిన చిత్రం మురారి. కృష్ణ‌వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది మంచి విజ‌యాన్నేసాధించినా ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ద‌ర్శ‌కుడు- హీరోల మ‌ధ్య వివాదాలు సాగినట్టు వ‌చ్చిన వార్త‌ల‌తో ఈ చిత్ర విజ‌యాన్ని తాను ఆస్వాదించ‌లేక‌పోయాన‌ని హీరో మ‌హేష్‌బాబు స్వ‌యంగా చెప్పుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత మ‌హేష్‌ను జేమ్స్‌బాండ్ త‌ర‌హా పాత్ర‌లో చూపించిన చిత్రం ట‌క్క‌రిదొంగ‌. విజ‌య‌వంత‌మైన చిత్రాలను తెర‌కెక్కించిన జ‌యంత్ సిఫ‌రాన్జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క నిర్మాత‌. 2002లో విడుద‌లైన ఈ చిత్రం కోసం మ‌హేష్ కూడా చాల శ్రమించాడు. రిస్కీ షాట్ల‌లో డూప్ లేకుండా న‌టించాడు. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయి విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత వచ్చిన చిత్రం ఒక్క‌డు. మ‌హేష్ మాస్ హీరోగా.. సూప‌ర్ స్టార్‌గా ఎదిగేందుకు బ‌ల‌మైన పునాది వేసిన చిత్రం ఇది.

ఇదే స‌మ‌యంలో అప్ప‌టికే చిత్రం, జ‌యం వంటి చిన్న‌ చిత్రాల‌తో పెద్ద విజ‌యాల‌ను సాధించిన ద‌ర్శ‌కుడు తేజ.. మ‌హేష్ కాంబోలో తెర‌కెక్కి 2003లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం నిజం. దీని బ‌డ్జెట్ ఆరున్న‌ర కోట్లు. న‌ట‌నాప‌రంగా మ‌హేష్‌కు నూటికి నూరు మార్కులు ప‌డిన చిత్ర‌మిది. అప్ప‌ట్లో మంచి అంచనాల మ‌ధ్య ఈ చిత్రం విడుద‌లైంది. మ‌హేష్ కూడా ఈ చిత్రంపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న ర‌క్షిత క‌థానాయిక‌. మ‌హేష్ న‌ట‌న ఈ చిత్రానికి హైలెట్ కాగా.. అత‌డిని మోటివేట్ చేసే తల్లి పాత్ర‌లో తాళ్లూరి రామేశ్వ‌రి కూడా గొప్ప న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. అన్యాయంగా తండ్రిని కోల్పోయిన హీరో..అందుకు కార‌ణ‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను, సంఘ వ్య‌తిరేక శ‌క్తుల‌ను త‌ల్లి సాయంతో ఒక పథ‌కం ప్ర‌కారం మ‌ట్టుపెట్డ‌డం  ఈచిత్ర క‌థ‌. అయితే అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ ఇది బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ ప‌ర‌చింది.
 నిజం చిత్ర ప‌రాజ‌యానికి కార‌ణం దీనికంటే ముందు వ‌చ్చి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌నూ మెప్పించిన ఒక్క‌డు చిత్ర‌మేన‌ని ద‌ర్శ‌కుడు తేజ ప‌లుసార్లు చెప్పాడు. ఒక్క‌డు చిత్రానికి ముందు మ‌హేష్‌బాబు ఇమేజ్ వేర‌ని, దానిని దృష్టిలో ఉంచుకుని తాను నిజం కథ రాసుకున్నాన‌ని, కాని ఒక్క‌డు మాస్ హీరోగా మ‌హేష్ స్థాయిని ఎక్క‌డికో తీసుకుపోయింద‌ని తేజ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అందుకే నిజంలో ఓ ఇన్నోసెంట్ గై పాత్ర‌లో మ‌హేష్ ను అత‌డి అభిమానుల‌తోపాటు, సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఆమోదించ‌లేక‌పోయార‌న్న ద‌ర్శ‌కుడి మాట‌ల్లో వాస్త‌వముంద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: