ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి .. తార‌క్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. డి.వి.వి దాన‌య్య ఈ చిత్రానికి నిర్మాత. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీపై క‌రోనా వైర‌స్ తీవ్ర‌త ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డింద‌ని చెప్పాలి. దీని కార‌ణంగానే ఏడాది కాలంగా ఈ చిత్రం షెడ్యూళ్లలో ప‌లు మార్పులు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ ప్యాన్‌ ఇండియా చిత్రం విడుదల విషయంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్త‌వానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసుకుంది. మార్చి నెల ముందువ‌ర‌కు క‌రోనా ఫ‌స్ట్‌వేవ్ ప్ర‌భావం త‌గ్గుతూ రావ‌డం, కొన్ని నిబంధ‌న‌ల‌తో థియేట‌ర్లు తిరిగి తెరుచుకోవ‌డంతో ఈ సినిమా విడుద‌ల‌కు ఇక‌ అడ్డంకులు ఉండ‌వ‌నే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా భావించాయి. అందుకే నిర్ధేశిత ల‌క్ష్యంలోగా బ్యాలెన్స్ వ‌ర్క్ పూర్తి చేసేందుకు చిత్ర బృందం గట్టిగానే శ్ర‌మించింది.

అయితే ఏప్రిల్ నెల నుంచి కోవిడ్ రెండో వేవ్ తీవ్ర‌రూపం దాల్చ‌డం, ఇది మొద‌టి వేవ్ కంటే మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించ‌డంతో మ‌రోసారి లాక్‌డౌన్ విధించ‌డంతో ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది.ఇప్పుడున్న ఆందోళ‌న‌కరం ప‌రిస్థితుల్లో ఇది ఎప్పుడు కంట్రోల్ లోకి వ‌స్తుందో సాధారణ స్థితి ఎప్పుడు నెల‌కొంటుందో ఎవ‌రూ  ఊహించ‌లేక‌పోతున్నారు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యేందుకు మ‌రో 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంద‌ని తెలుస్తోంది.  ఆ త‌రువాత వీఎఫ్‌ఎక్స్‌, నిర్మాణానంతర కార్యక్రమాలకు కూడా ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. అస‌లే భారీ బ‌డ్జెట్ చిత్రం కావ‌డంతోపాటు,  సినిమా క్వాలిటీ విష‌యంలో జ‌క్క‌న్న ఎక్క‌డా రాజీప‌డ‌డన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం ఉన్న కోవిడ్ ప్ర‌మాదాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తుంటే ఈ ఏడాదికి సినిమా రిలీజ్‌ లేనట్లే కనిపిస్తోంది. ఇక వ‌చ్చే ఏడాది వేస‌వి సీజ‌న్‌కు ఈ చిత్రం విడుద‌ల మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెపుతున్నాయి.  అయితే  ఈ మూవీలో న‌టిస్తున్న హీరోలిద్దరూ అంత‌కాలం వాయిదా వేసేందుకు సుముఖంగా లేర‌ని.. సంక్రాంతి సీజ‌న్‌లో అయినా ప్రేక్ష‌కుల‌ముందుకొస్తే బాగుంటుంద‌ని అంటున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇలా జ‌రిగేందుకు కూడా  కొన్ని అడ్డంకులున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగేందుకు  పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ చిత్రాలు సిద్ద‌మ‌వుతున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా అదే సమయానికి ఫిక్స్‌ అయితే గట్టి పోటీనే ఉంటుంది. అన్ని భారీ చిత్రాలు ఒకేసారి వ‌స్తే థియేట‌ర్ల స‌మ‌స్య కూడా త‌ప్ప‌దు. మ‌రి ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర బృందం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: