క‌రోనా వైర‌స్ మొద‌టి వేవ్ ప్ర‌భావంతో థియేట‌ర్లు చాలాకాలం మూత‌ప‌డ‌టంతో కుదేలైన‌ చిత్ర ప‌రిశ్ర‌మ కాస్త కోలుకుంటోంద‌న్న‌ద‌శ‌లో క‌రోనా రెండో వేవ్ మొదలైంది. దీంతో రిలీజ్‌కు సిద్ధ‌మైన ప‌లు చిత్రాలు వాయిదా ప‌డ‌గా, మ‌రికొన్ని సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంక్రాంతి పండుగ‌, ఆ త‌రువాత వేస‌వి సీజన్ ప్ర‌ధాన‌మైన‌వి. అయితే కోవిడ్ కార‌ణంగా ఈ లెక్క‌ల‌న్నీ పూర్తిగా మారిపోయాయి. గ‌త వేస‌వి సీజ‌న్, ఆత‌రువాత ఈ ఏడాది సంక్రాంతి, వేస‌వి అన్నింటినీ క‌రోనా మింగేసింది. ఈ స‌మ‌యంలో థియేట‌ర్ల‌కు జ‌నాన్ని ర‌ప్పించ‌గ‌లిగిన ఏకైక చిత్రం ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన‌ వ‌కీల్ సాబ్ మాత్ర‌మే. ఈ కాలంలో కొన్ని చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. సాధార‌ణంగా సినిమాలు అనుకున్న స‌మ‌యానికి పూర్తికాక‌పోతే వాటి బ‌డ్జెట్ పెరిగిపోతుంది. అందుకే రాత్రి ప‌గ‌లూ తేడా లేకుండా శ్రమించి అనుకున్న స‌మ‌యానికి చిత్రాల‌ను పూర్తి చేసేందుకే నిర్మాత‌లు,టెక్నీషియ‌న్లు శ్ర‌మిస్తారు. కానీ ఇది గ‌తంలో ఎన్న‌డూ ఎదురుకాని ప‌రిస్థితి కావ‌డంతో చిన్న చిత్రాల నిర్మాత‌ల‌తోపాటు, భారీ బ‌డ్జెట్ సినిమాల ప్రొడ్యూస‌ర్ల‌కు ఏం చేయాలో అర్థం కావ‌డంలేదు.
            ఇదిలా ఉండ‌గా ఇప్పుడు మూడో వేవ్ ప్ర‌మాదం కూడా  రానుంద‌ని వార్త‌లు వ‌స్తుండ‌టంతో ప్రొడ్యూస‌ర్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇదే జ‌రిగితే థియేట‌ర్ల‌కు ఇప్ప‌ట్లో జ‌నం వ‌చ్చే అవ‌కాశ‌మే ఉండ‌దు. ఒక‌వేళ ఏదోర‌కంగా నిర్మాణం పూర్తి చేయ‌గ‌లిగినా ఆ చిత్రాల‌ను మ‌రోసారి వాయిదా వేసుకోవ‌డం త‌ప్ప వేరే మార్గం ఉండ‌ద‌న్న ఆందోళ‌న లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ ప‌రిస్థితుల్లోనూ వారికి మిగిలిన ఏకైక ఆశ ఓటీటీ లో చిత్రాలు విడుద‌ల చేసుకోవ‌డం. ఇప్ప‌టిదాకా ఎక్కువ సంఖ్య‌లో చిన్న చిత్రాలు మాత్ర‌మే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ లో విడుద‌ల చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇక‌పై పెద్ద చిత్రాల‌కూ ఇది త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రో సానుకూల‌మైన అంశ‌మేమిటంటే ఇప్పుడు ద‌క్షిణాది సినిమాల‌కు దేశవ్యాప్తంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్ల నుంచి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు వాటి స్థాయికి త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌వ‌చ్చ‌న్న అంచనాలు వెలువ‌డుతున్నాయి. మ‌రి రానున్న రోజుల‌లో ఎన్ని చిత్రాలు ఈ బాట‌లో సాగుతాయో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: