టాలీవుడ్ కి ఎన్టీయార్ ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పాల్సిందే. ఇద్దరూ దశాబ్దాల పాటు సినీ సీమను శాసించారు. ఇద్దరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పరిశ్రమలో నెలకొల్పారు. ఇద్దరూ కొత్త వారిని ప్రోత్సహించి టాలీవుడ్ పచ్చగా పదికాలాలు ఉండేలా చూశారు.

ఇక దాదాపుగా ఒకే సమయంలో ఎన్టీయార్ ఏయన్నార్ సినీ సీమలో ప్రవేశించారు. అలాగే ఇద్దరికీ ఒకేసారి స్టార్ డమ్ వచ్చింది. ఎన్టీయార్ మాస్ హీరోగా  జానపద, పౌరాణిక నాయకుడిగా రాణిస్తూంటే సాంఘిక చిత్రాలలో ఏయన్నార్ తన హవా చాటుకున్నారు. ఇక ఇద్దరికీ సెపరేట్ టెక్నికల్ ట్రూప్ ఉండేది. ఎస్ రాజేశ్వరరావు, ఆత్రేయ వంటి వారు అక్కినేని సినిమాలకు ఎక్కువగా పనిచేస్తే ఎన్టీయార్ సినిమాలకు టీవీ రాజు డాక్టర్ సి నారాయణరెడ్డి పనిచేసేవారు.

ఇక్కడ డాక్టర్ సి నారాయణరెడ్డి గురించి  కొన్ని విషయాలు చెప్పుకోవాలి. హైదరాబాద్ లో సినారే అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన్ని సినీ రంగంలోకి తీసుకురావాలని అక్కినేని సహా అనేక మంది ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎన్టీయార్ ద్వారానే పరిచయం అయ్యారు. ఎన్టీయార్ సొంత బ్యానర్ ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన గుళేబకావళి కధ మూవీ ద్వారా సింహద్వరం గుండానే తాను  సినిమాల్లోకి వచ్చాను అని అనేకసార్లు సినారే చెప్పుకున్నారు. ఒక సినిమాకు టోటల్ గా పాటలు రాసే ఛాన్స్ ఎన్టీయార్ మూవీ ద్వారానే దక్కింది అని ఆయన చెప్పేవారు.

ఆయన ఎక్కువగా ఎన్టీయార్ సినిమాలకే పాటలు రాశారు. ఆయన ఎన్టీయార్ సినిమాలతో పరిచయం కావడంతో అక్కినేని క్యాంప్ కి దూరంగా ఉండిపోయారు అన్న ప్రచారం కూడా ఉంది. అయితే అక్కినేని సినిమాలకు కూడా సినారే తన గీత రచన చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి ఆయా డైరెక్టర్ల ఎంపికతోనే జరిగింది అంటారు. ఇక ఆచార్య ఆత్రేయ విషయం కూడా  డిటోనే . ఆయన ఎక్కువగా అక్కినేనికే పనిచేసారు. అక్కినేని హీరోగా ఆయన వాగ్దానం అన్న  సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అలా అక్కినేని మనిషిగా ఆత్రేయని అప్పట్లో ముద్ర వేసేవారుట. దాంతో ఆయన ఎన్టీయార్ కి కూడా ఎన్నో సినిమా పాటలు రాసినా అక్కినేని క్యాంప్ అన్నట్లుగానే ముద్ర వేశారుట. వేటూరి రంగ ప్రవేశం చేశాక అటు అక్కినేని ఇటు ఎన్టీయార్ కి కూడా ఒకేసారి పాటలు రాసి అందరి వాడు అనిపించుకున్నారుని చెబుతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: