550 సినిమాలలో నటించిన మోహన్ బాబు ఇప్పటి వరకు నటించని పాత్రలేదు. విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలను చేసిన మోహన్ బాబు హవా గతకొంత కాలంగా తక్కువగా కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా తన కొడుకులు విష్ణు మనోజ్ లను హీరోలుగా బాగా సెటిల్ చేయాలని మోహన్ బాబు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమాత్రం కలిసిరాలేదు.

దీనితో తిరిగి తానే హీరోగా మళ్ళీ ఇన్నింగ్స్ ప్రారంభించాలని మోహన్ బాబు నిశ్చయించుకుని నటిస్తున్న ‘సన్నాఫ్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మంచు విష్ణు నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు నటి విశ్వరూపం మళ్ళీ కనిపిస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు మోహన్ బాబు కెరియర్ లో ఒక మైలురాయి గా మిగిలిపోయిన ‘పెదరాయుడు’ సెంటిమెంట్ ప్రభావితం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

26 సంవత్సరాల క్రితం జూన్ 15న ‘పెదరాయుడు’ మూవీ విడుదలై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కలక్షన్స్ సునామి సృష్టించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని ‘సన్నాఫ్ ఇండియా’ మూవీకి సంబంధించిన ఒక లిరికల్ వీడియో ఈరోజు విడుదలకాబోతోంది. 11వ శతాబ్దానికి చెందిన రఘువీరా కవి గద్యాన్ని ఇళయరాజా సంగీత సారధ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియోగా విడుదల చేస్తున్నారు.

ఈ పాటను ఈ సినిమా యూనిట్ శ్రీరాముడు కి అంకితం ఇస్తోంది. సంస్కృత పదజాలంతో అత్యంత కఠినమైన ఈ గద్యాన్ని అర్థంచేసుకుని ఈ లిరికల్ లో మోహన్ బాబు అద్భుతమైన నటన ప్రదర్శించాడని వార్తలు వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డుపడకుండా ఉంటే ఈపాటికే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయి ఉండేది. ఈతరం యూత్ ప్రేక్షకులకు మోహన్ బాబు నట విశ్వరూపం తెలియదు. దీనితో తన సత్తాను మళ్ళీ అందరికి తెలిసి వచ్చేలా ఈ సినిమా కోసం మోహన్ బాబు చాలా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: