వెంకటేష్, సౌందర్య, భానుప్రియ ప్రధానపాత్రల్లో నటించిన "జయం మనదేరా" సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందింది. ఎన్.శంకర్ దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మాణంలో రూపొందిన 'జయం మనదేరా' 2000, అక్టోబర్ 7న విడుదల అయింది. అయితే తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న "జయం మనదేరా" సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ షేరు అక్షరాలా 12 కోట్ల రూపాయలు అంటే అతిశయోక్తి కాదు. 104 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా 34 కేంద్రాలలో వంద రోజులకు పైగా ఆడి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఉత్తమ నటనా ప్రదర్శన కనపరిచిన వెంకటేష్ కి బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది.

ఇక సినిమా కథ గురించి చెప్పుకుంటే.. అభిరామ్ అనే ఓ సరదా యువకుడు లండన్ లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటాడు. అయితే 8 మంది తెలుగువారు థమ్సప్ యూరప్ ట్రిప్ కాంటెస్ట్ లో గెలుస్తారు. వారిలో ఉమా అనే ఒక యువతి (సౌందర్య) కూడా ఉంటుంది. ఆమెతో పరిచయం పెంచుకోడానికి అభిరామ్ టూరిస్ట్ గైడ్ గా మారతారు. ఫస్టాప్ అంతా కూడా యూరప్ ట్రిప్ కి సంబంధించిన సన్నివేశాలే ఉంటాయి. అభిరామ్, ఉమా మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. అయితే కాలక్రమేణా ఉమా అభిరాం పై మనస్సు పారేసుకుంటుంది. నేరుగా తన ప్రేమను వ్యక్తం పరచలేక ఆమె ఒక మెసేజ్ పంపిస్తుంది. కానీ అభి ఆ మెసేజ్ ఆలస్యంగా వింటారు. అప్పటికే ఉమ తన ఇంటికి వెళ్లిపోతుంది. అంతేకాదు ఆమె తండ్రి ఆమెకు ఒక పెళ్లి సంబంధాన్ని కూడా మాట్లాడుతాడు. చివరికి అభి ఉమా పంపించిన మెసేజ్ విని హుటాహుటిన భారతదేశానికి వెళ్తాడు. ఉమాని తనతో పాటు లండన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

కానీ అక్కడి గుండాలు వీరిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని భవాని అనే మహిళ కాపాడుతుంది. ఆ తర్వాత ఆమె అభిరాం కి తన తండ్రి గురించి చెబుతుంది. తన తండ్రి మహాదేవనాయుడు అని.. అతడు దళితుల కోసం పోరాడారని, అణగారిన వర్గాలపై అరాచకాలను రూపుమాపేందుకు కృషి చేశారని.. కానీ సొంత బంధువులే అతడ్ని చంపేశారని భవాని అభిరామ్ కి చెబుతుంది. దీంతో అభిరామ్ తన తండ్రిని చంపేసిన వారందరిని చంపేసి మళ్లీ.. తాను కూడా తన తండ్రి లాగా దళితులకు అండగా ఉండాలని భావిస్తారు. ఆయన అనుకున్నదే తడవుగా విలన్స్ పై పోరాడి గెలుస్తారు.

ఈ సినిమాలోని సెకండాఫ్ ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్ ని అలరించింది. కత్తులు, కటార్లు పట్టుకుని గుండాలు హీరోతో ఫైట్ చేసే సన్నివేశాలు చాలా బాగున్నాయి. హీరో పదిమంది గూండాలను ఒకేసారి ఎదుర్కొనే సన్నివేశాలు హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఒక గుండాని హీరో తొక్కితే అతడు భూమిలోకి కూరుకుపోతాడు. ఈ సినిమాలో అభిరామ్ రుద్రమనాయుడుగా మారి తన తండ్రి మహాదేవనాయుడు వస్త్రాలు కట్టుకునే సన్నివేశం కూడా ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్స్ తెప్పించింది. ఈ చిత్రంలో పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. కుమార్ సాను, స్వర్ణలత ఆలపించిన మెరిసేటి జాబిలి నువ్వే పాట అప్పట్లో మారుమ్రోగింది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ వంటి అన్ని ఎలిమెంట్స్ తో వచ్చిన జయం మనదేరా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: