మొత్తానికి కరోనా కరుణిస్తోంది. మెల్లగా సినిమా హాళ్ళు తెరచుకునే సీన్ కనిపిస్తోంది. అన్నీ అనుకూలంగా ఉంటే జూలై నుంచి సినిమా హాళ్ళలో బొమ్మ పడే అవకాశం ఉంది. అయితే థియేటర్లు తెరచుకుంటాయి బాగానే ఉంది. కానీ జవాబు లేని ప్రశ్నలు కూడా వాటితో పాటే ఎన్నో ఉన్నాయి మరి.

సినిమా హాళ్ళకు కావాల్సింది కొత్త సినిమాలు, మూడు నెలలుగా జనాలు ఇంట్లోనే ఉంటున్నారు. వారికి కనుక వినోదం అవసరం అయితే కచ్చితంగా థియేటర్లకు రావాలని అనుకుంటారు. మరి అలా వచ్చిన వారు పాత సినిమాలు, రిపీటెడ్ రిలీజెస్ మూవీస్ ని అసలు  చూడరు కదా.  మంచి సినిమా అన్నది వారికి కావాలి. అలాగే అగ్ర నటుల సినిమాలు కూడా కావాలి. అలా కనుక ఆలోచిస్తే కొత్త సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతాయి అన్నదే ఇపుడు చర్చ.

ఇదిలా ఉంటే చిన్న సినిమాలు ఇప్పటిదాకా క్యూలో చాలానే ఉన్నాయి. అవి టైమ్ చూసి మెల్లగా రిలీజ్ అవుతాయి అంటున్నారు. సినిమా హాళ్ళు తెరచుకున్నా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుతారు. అందువల్ల పెద్ద సినిమాలు ఎవరివీ  రావు, ఎందుకంటే వాటి బడ్జెట్ కి ఈ కలెక్ష‌న్లు సరిపోవు, పైగా జనాల మూడ్ ఎలా ఉంటుందో తెలిసేంతవరకూ బడా సినిమాలు థియేటర్ల వైపు చూడవు.

దాంతో కొత్త సినిమాలుగా వచ్చేవన్నీ చిన్నవి, మీడియం బడ్జెట్ మూవీస్ మాత్రమే. వీటితో పాటు నాని టక్ జగదీష్, రానా విరాటపర్వం సినిమాలు కూడా థియేటర్లలోనే రిలీజ్ అవుతాయట. అయితే ఇవి రావడానికి కొంత టైమ్ పడుతుంది. ఈ లోగా విశ్వక్సేన్ పాగల్ తో పాటు చిన్న హీరోలు నటించిన సినిమాలు వెల్లువలా రానున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాల ద్వారా జనాలను థియేటర్లకు రప్పించే శక్తి ఉందా అన్నదే డౌట్. చూడాలి మరి ఏం జరుగుతుందో.




మరింత సమాచారం తెలుసుకోండి: