జంధ్యాల. ఈ మూడు అక్షరాలు టాలీవుడ్ ని మూడు దశాబ్దాల పాటు నవ్వించాయి. జంధ్యాల మాటలు అంటేనే పొట్టచక్కలు అయ్యే నవ్వు వస్తుంది. అటువంటి ఆయన దర్శకుడుగా మారి వెండి తెర మీద కూడా కామెడీని హీరోని చేసి నిలబెట్టాడు.

జంధ్యాల మాటలు వినాలి అంటే వేటగాడు సినిమా చూడాలి. అందులో రావు గోపాలరావు క్యారక్టర్ గుక్క తిప్పుకోకుండా ప్రాసలతో చెప్పే డైలాగులు నాటికీ నేటికీ కూడా అలరిస్తాయి. జంధ్యాల మాటలు రాఘవేంద్రరావు, కె విశ్వనాధ్ వంటి దర్శకుల సినిమాలకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఇక ఆయన సొంతంగా డైరెక్షన్ మొదలెట్టాక తెలుగు సినిమా హాస్యానికి కొత్త దారులు కనిపెట్టాడు. ఆయనది ఆగోగ్యకరమైన హాస్యం. ఇంటిల్లపాదీ నవ్వుకునే సన్నివేశాలు ఆయన సినిమా నిండా ఉండేవి.

నవ్వు ఒక భోగం అంటూ హాస్య వైద్యునిగా మారి అందరి ఆరోగ్యాన్ని పంచిన  జంధ్యాల తాను మాత్రం అర్ధాంతరంగా యాభై ఏళ్ళకే ఈ లోకాన్ని వీడిపోయారు. అయితేనేమి ఆయన టాలీవుడ్ లో  తనకంటూ ఒక బలమైన ముద్ర వేసుకున్నారు. నలభైకి పైగా సినిమాలు తీసి తెలుగు జాతికి వాటిని అంకితం ఇచ్చేశారు. ఇక్కడ జంధ్యాల సినిమాలతో పాటు అందులోని పాటలను కూడా చెప్పుకోవాలి. వీనుల విందైన పాటలు, వాటిని అందంగా చిత్రీకరించిన తీరు ఆయనకే చెల్లు, శ్రీవారికి ప్రేమ లేఖ కానీ, ముద్ద మందారం, రెండు జెళ్ళ సీత, రెండు రెళ్ళు ఆరు వంటి సినిమాల్లో పాటలను ఎవరైనా మరచిపోగలరా.

ఇక జంధ్యాల తొలి సినిమా మొదలుపెడితే తీసినవన్నీ కూడా విశాఖలోనే. ఆయనకు విశాఖ అంటే అంత ఇష్టం. ఆయన కెమెరా విశాఖను మాత్రమే చూస్తుంది. ఇపుడు ఆ సినిమాలు చూస్తే విశాఖ సొగసు అలాగే పదిలంగా భద్రంగా కనిపిస్తుంది. జంధ్యాల కంటే ముందు బాలచందర్, విశ్వనాధ్, దాసరి వంటి వారు విశాఖలో సినిమాలు తీసినా తాను తీసిన సినిమాల్లో దాదాపుగా అన్నీ కూడా విశాఖలో షూట్ చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. అంటే ఆయన హాట్ ఫేవరేట్ హీరోయిన్ విశాఖ సుందరి
అన్న మాట.




మరింత సమాచారం తెలుసుకోండి: