కళ్ళు మూసుకుంటే మూడు నెలలు. అంతే దసరా పండుగ వచ్చేస్తుంది. తెలుగు వారికి అదొక పెద్ద పండుగ. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాతి తరువాత మరో పెద్ద పండువ. టాలీవుడ్ కి అత్యంత ముఖ్యమైన సీజన్ ఇదే.

టాలీవుడ్ లో దసరా రిలీజ్ కి మంచి డిమాండ్ కూడా ఎపుడూ ఉంటుంది. ఏకంగా పది రోజుల పాటు స్కూల్స్ కి సెలవులు వస్తాయి. అటు నుంచి ఇటు వచ్చీ పోయే జనాలతో సందడి బాగా ఉంటుంది. ఇక టాలీవుడ్ హిస్టరీలో దసరా హిట్స్ కూడా చాలానే ఉన్నాయి. అందరి హీరోలకు కూడా ఈ విషయంలో రికార్డులు ఉన్నాయి.

అయితే ఈసారి వచ్చే దసరా ప్రత్యేకమైనది. కరోనా రెండు దశలు పూర్తి అయిన తరువాత వచ్చే అతి పెద్ద సీజన్ ఇదే కావడంతో టాలీవుడ్ లో ఆశలు మామూలుగా లేవు. దసరా బరిలో తమ బొమ్మ నిలపాలని పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అంతా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ లో కరోనా కారణంగా రిలీజ్ కాకుండా ఆగిన బొమ్మలు అన్నీ కూడా ఇపుడే రిలీజ్ చేయాలని కూడా చాలా మంది పంతం మీద ఉన్నారు.

అయితే ఇలా ప్రచారం సాగుతున్న సినిమాలలో చాలా మటుకు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందువల్ల అవి ఎపుడు పూర్తి అవుతాయో తెలియదు. మరో వైపు చూసుకుంటే ఎంత దసరా అయినా కూడా ఒక ఆరేడు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తే తట్టుకునే స్తోమత ఉంది కానీ ఒకేసారి పదుల సంఖ్యలో బొమ్మలు వచ్చి పడితే కష్టమే అంటున్నారు. పైగా థియేటర్ల సమస్య  ఎటూ ఉండనే ఉంది.  ఇంకో వైపు చూసుకుంటే దసరాకా, సంక్రాంతికా అన్న క్లారిటీ కూడా చాలా సినిమాలకు లేకపోవడం విశేషం

ఇవన్నీ పక్కన పెడితే దేశంలో మూడవ దశ కరోనా అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతుంది అని వైద్య నిపుణులు అపుడే ప్రకటనలు ఇస్తున్నారు. అంటే సరిగ్గా దసరా పండుగ గుమ్మంలో ఉండగానే కరోనా థర్డ్ వేవ్ వచ్చి పడితే మళ్లీ బొమ్మలన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే. దాంతో దసరాకు తన సినిమా రిలీజ్ అని అంతా అంటున్నా ఎవరి దగ్గరా క్లారిటీ అయితే ఇప్పటికి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: