బాలు అంటే గాన గంధర్వుడు. కేవలం ఇరవైఏళ్ళ ప్రాయంలోనే గొంతు విప్పి తెలుగు సినిమా రంగం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న ప్రతిభాశాలి. బాలును బహు కంఠుడు అంటారు. ఆయన గొంతులో పలకని స్వరాలు లేవు. వినిపించని నటుడు లేడు.

టాలీవుడ్ లో బాలు ఎంటర్ అయ్యాక అందరు హీరోలకూ ఆయనే పాడేవారు. వేరే గాయకులకు అవకాశాలు రాకుండా పోయాయి. ఈ విషయంలో బాలూ మీద అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. తమ అవకాశాలను బాలూ దెబ్బతీశారని కొందరు గాయకులు మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్న ఘటనలూ ఉన్నాయి. దానికి బాలూ కూడా ధీటుగానే బదులిచ్చేవారు.

తాను ఒక్కడే టాలీవుడ్ కాదని, తాను ఎవరి అవకాశాలనూ దెబ్బ తీయలేదని, నాడు అంతా తన పాటలే కావాలని కోరడం వల్లనే అలా జరిగిపోయిందని బాలూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు. ఇదిలా ఉంటే ఇవన్నీ ఉత్త ఆరోపణలే అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బాలూ చాలా మంది గాయకులను స్వయాన ప్రోత్సహించేవారు కూడా. ఇటీవల బాలూ మొదటి జయంతి వేళ ప్రముఖ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన హీరోగా  నటించిన కల్పన మూవీ లో దిక్కులు చూడకు రామయ్య అన్న పాటను జి ఆనంద్ పాడారు.

ఈ పాట నిజానికి బాలూ పాడాలి. అయితే బాలూ ఆ టైమ్ లో బిజీగా ఉండడంతో ట్రాక్ కోసమని జి ఆనంద్ చేత పాడించారుట. తీరా బాలూ ఆ రోజు  సాయంత్రం వచ్చి ఆ పాట విని తాను మళ్ళీ పాడను అని చెప్పేసి చిత్ర యూనిట్ కి  షాక్ ఇచ్చారట. ఆనంద్ చక్కగా పాడారని, మళ్ళీ తాను ఎందుకు పాడాలి అని బాలూ వారికి నచ్చ‌చెప్పి కొత్తగా అప్పటికి సినీ ఇండస్ట్రీలో ఎంటరైన ఆనంద్ ని ప్రోత్సహించారు అని మురళీమోహన్ చెప్పడం విశేషం. ఆ మూవీలో ఈ పాట సూపర్ హిట్ అయింది. ఆనంద్ కి మంచి పేరు తేవడమే కాకుండా ఆయనకు మరిన్ని అవకాశాలు దక్కేలా చేసింది కూడా. మరి బాలూ ఎవరినీ రానీయరు అన్న ఆరోపణలు తప్పు  అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

spb