ఫోక్ సింగర్ మంగ్లీ త‌న పాట‌ల‌తో తెలుగులో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బంజారా జాతికి చెందిన మంగ్లీ అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు జానపదాల‌తోనూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక మంగ్లీ ప్ర‌తి పండ‌గ‌కు ఓ పాట‌ను విడుద‌ల చేయడం...ఆ పాట యూట్యూబ్ లో మారు మోగిపోవ‌డం సాధార‌ణ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కూ మంగ్లీ విడుద‌ల చేసిన ఎన్నో పాట‌ల‌కు మిలియ‌న్స్ వ్యూవ్స్ వ‌చ్చాయి. బ‌తుక‌మ్మ‌, బోనాలు, శివ‌రాత్రి ఇలా అన్ని పండ‌గ‌ల‌కు మంగ్లీ పాట‌లు విడుద‌ల చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే మంగ్లీ ఈ యేడాది బోనాల సంధ‌ర్భంగా చెట్టు కింద కూసున్న‌వ‌మ్మ అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ పాట కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ పాట పై కొన్ని వివాదాలు త‌లెత్త‌డం కూడా ఇప్పుడు మంగ్లీకి త‌ల‌నొప్పిగా మారింది. పాట‌లో మోతెవ‌రి అంటూ అస‌భ్య‌ప‌ద‌జాలం వాడి అమ్మ‌వారిని అవ‌మానించారంటూ ప‌లువురు ఆరోపిస్తున్నారు. 

మ‌రోవైపు ఓ బీజేపీ కార్పోరేట‌ర్ మంగ్లీపై పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. కాగా ఈ వివాదంపై తాజాగా మంగ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ప్రముఖ రచయిత రామస్వామి గారి అభిప్రాయం ప్రకారం చెట్టు కింద కూసున్న అమ్మ అనే పాటలో మోతే వారి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థం వస్తుంది అని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందని... నిందాస్తుతి లో కోలాటం రూపంలో సాగే ఈ పాటను తమకు తెలిసిన కొంతమంది కళాకారులు పెద్దల సలహాలు తీసుకొని చిత్రీకరించినట్లు తెలిపింది. తాను పండితుల కుటుంబంలో జన్మించలేద‌ని చెట్లు, పుట్టలను కొలిసే గిరిజన జాతికి చెందిన తండా నుండి వచ్చానని పేర్కొంది. బతుకమ్మ బోనాల పండుగ ఎలాగో బంజారాల‌తీజ్ పండుగ కూడా అలాగే అని తెలిపింది. ప్రకృతిని దేవతలుగా పూజిస్తాం అని చెప్పింది.

తమకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా నమ్ముకున్నది గ్రామదేవతలను అని తెలిపింది. తాను సింగర్ గా ఎదిగింది కూడా అమ్మవారికి వ‌ల్లేనే అని న‌మ్ముతున్న‌ట్టు పేర్కొంది. అయితే ఇప్పుడు ఏ నాడు గుడికి వెళ్ళని వాళ్ళు కూడా తనను... తన జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఎంతవరకు సమంజసం గమనించాలని చెప్పింది. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం లాల్దర్వాజా అమ్మవారికి బోనం ఎత్తుతున్నా అని తెలిపింది. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ సమ్మక్క సారక్క శివరాత్రి పాటలను చిత్రీకరిస్తున్నాం అని తెలిపింది. తను ఒక్క రోజులో ఫేమస్ అవ్వలేదని తన కష్టం ఎంతో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేసింది. నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకొని విమర్శలు చేస్తే విజ్ఞత ఉండేదని తెలిపింది. తనకెంతో బాధ కలిగించిందని అందుకే ఈ పోస్ట్ చేస్తున్నారని మంగ్లీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: