ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. చాలా కాలంగా స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావుకు 'భారతరత్న' ఇవ్వాలని ఆయన అభిమానులు, తెలుగువారు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అత్యున్నత పురస్కారాన్ని అందించే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉలకూ పలుకూ లేకుండా ఉంది. దీంతో తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఆయన నటించిన "ఆదిత్య 369" చిత్రం 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. 

ఈ సినిమాలోని "జాణవులే నెరజాణవులే" సాంగ్ విషయమై మాట్లాడుతూ ఇళయరాజా గారి మ్యూజిక్ అద్భుతం. ఒక విమర్శకుడిగా ఈ విషయం ఒప్పుకుంటాను. ఒక్కొక్కరికీ ఒక్కో మ్యూజిక్ స్టైల్ ఉంటుంది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రస్తావించారు. ఆ వెంటనే "ఎఆర్ రెహమాన్ ఎవరో నాకు తెలియదు నేను పట్టించుకోను. పదేళ్లకు హిట్ ఇచ్చే అతనికి ఆస్కార్ అవార్డ్... అందుకే 'భారతరత్న' అంటే రామారావు చెప్పుతో సమానం, కాలిగోటితో సమానం. అది అందుకున్నందుకు ఆయనకు కాదు గౌరవం... ఇచ్చిన వాళ్లకు గౌరవం" అని అన్నారు. అవార్డులు అందుకున్నంత మాత్రాన అందరూ మాత్రం గొప్ప వాళ్ళు కాదని, ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు? అని ప్రశ్నించారు. 'భారతరత్న' రాకపోవడం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదని, ఎన్టీఆర్ కు 'భారతరత్న' కాలిగోటితో సమానం అని, ఆయన చెప్పుతో సమానం అని అన్నారు.

దీంతో ఒక్కసారిగా బాలయ్యపై ట్రోలింగ్ మొదలైంది. "హూ ఈజ్ బాలయ్య" అనే హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. బాలయ్య ఆ వ్యాఖ్యలను ఆవేశంలో అన్నారేమో కానీ ఇది వివాదంగా మారినట్టు కనిపిస్తోంది. గతంలోనూ 'భారతరత్న' అవార్డుపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరి సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తున్న తన వ్యాఖ్యలపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: