దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కేవలం తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా భారత దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. తండ్రి కేఎస్‌. ప్ర‌కాష్ రావు నుంచి ద‌ర్శ‌క‌త్వ ఓన‌మాలు నేర్చుకున్న ఆయ‌న తెలుగు లోనే కాకుండా... హిందీలో కూడా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారు. 1970వ దశకం నుంచి 2021 వరకు ఐదు దశాబ్దాల పాటు తన కెరీర్ ను అప్రతిహతంగా కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. ఏ దర్శకుడైనా ఐదు ద‌శాబ్దాల పాటు సినిమా రంగంలో కొనసాగుతున్నారు అంటే పెద్ద రికార్డు గానే చెప్పాలి. తెలుగు సినిమా రంగంలో శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరున్న రాఘవేంద్ర రావు నాడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ లాంటి హీరోల నుంచి చిరంజీవి - నాగార్జున - బాలకృష్ణ - వెంకటేష్ లాంటి 1990వ దశకం స్టార్ హీరోల నుంచి నేటి తరంలో మంచు మనోజ్ - అల్లు అర్జున్ లాంటి యంగ్‌ స్టార్ హీరోల వరకు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు.

ఇక భక్తిర‌స‌ చిత్రాల్లోనూ రాఘవేంద్రరావు తన ప్రత్యేకత చాటుకున్నారు. నాగార్జున తో అన్నమయ్య , శ్రీరామదాసు.. బాలకృష్ణతో పాండురంగడు చిత్రాలను ఆయన తెరకెక్కించి హిట్ కొట్టారు. అయితే బాలయ్య తో తెరకెక్కించిన పాండురంగడు సినిమాను ముందుగా ఆయ‌న‌తో కాకుండా ర‌వితేజ‌తో చేయాల‌ని ద‌ర్శ‌కేంద్రుడు అనుకున్నార‌ట‌. ఈ సినిమా రవితేజ తో చేస్తే ఎలా ఉంటుందని ఒకానొక దశలో ఆయన ఆలోచన చేశారట.

ఈ విషయాన్ని అమెరికాలో ఓ కార్యక్రమంలో కలిసిన రవితేజతో చెప్పగా అప్పుడు రవితేజ సార్ నా ఫేస్ కు పాండురంగడు కథకు ఏ మాత్రం సూట్ కాదని చెప్పాడ‌ట‌. అప్పుడు రాఘవేంద్రరావు పాండురంగ‌డు క‌థ‌ను బాలకృష్ణ తో తెరకెక్కించారు. అయితే అంతకు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసిన రవితేజ ఆయన దర్శకత్వంలో హీరోగా చేసే అవకాశం మాత్రం మిస్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: