సౌత్ లో పాన్ ఇండియా సినిమాలా హవా పెరిగిపోయింది. అయితే ఆ పేరులో ఏం మాయ, మత్తు ఉందో తెలియదు కానీ ఇప్పుడందరూ అదే పేరును కలవరిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీకి "భీమ్" మేనియా పట్టుకుంది. ఎక్కడ చూసినా అదే పేరు విన్పిస్తోంది. రాబోయే భారీ చిత్రాలన్నిటిలోనూ ఈ పేరునే ఉపయోగిస్తున్నారు. ముందుగా రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ "ఆర్ఆర్ఆర్" నుంచి ఈ పేరు ట్రెండ్ అవ్వడం మొదలైంది. "ఆర్ఆర్ఆర్"లో ఎన్టీఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి "భీమ్" అనే పేరు సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. "ఆర్ఆర్ఆర్" నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లుక్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున "భీమ్"ను ట్రెండ్ చేశారు. అయితే తాజాగా తెరకెక్కుతున్న మరి కొన్ని సినిమాల్లో కూడా "భీమ్" క్రేజ్ ను బాగా ఉపయోగించుకున్నారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్. ఈరోజు ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో పవన్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా... ఆయన పాత్ర పేరు "భీమ్లా నాయక్" అని ప్రకటించారు. ఇంకేముంది దాదాపుగా "భీమ్"కు దగ్గరగా ఉన్న "భీమ్లా" పేరుతో ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డారు మెగా అభిమానులు కూడా. ఇక మరో సౌత్ సూపర్ స్టార్, విలక్షణ కథానాయకుడు సూర్య కూడా "జై భీమ్" అంటూ ఇటీవలే ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. "జై భీమ్"గా సూర్య తన 39వ సినిమాలో గిరిజనుల కోసం పోరాటం చేసే న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. దాంతో టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ "భీమ్" పేరు మారుమ్రోగిపోతోంది. మరి పాపులర్ గా మారిపోయిన "భీమ్"ను సౌత్ సక్సెస్ మంత్రంగా భావిస్తుందా ? అనే డౌట్ రాక మానదు. ఇదంతా రాజమౌళి చలవే అని చెప్పాలి. ఇంతకుముందు కూడా కొమరం భీమ్ అంటే స్పెషల్ అయినప్పటికీ నిస్సందేహంగా ఆయన అనౌన్స్ మెంట్ తోనే ఆ పేరుకు మరింతగా క్రేజ్ లభించింది. చూడాలి మరి అంతా అనుకుంటున్నట్టుగానే "భీమ్" అనే పేరు సౌత్ సక్సెస్ మంత్రంగా పని చేస్తుందేమో !!    

మరింత సమాచారం తెలుసుకోండి: