టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. విభిన్న కథా చిత్రాలు ఎన్నో వచ్చి మనసు దోచుకుంటున్నాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే కొత్త దర్శకులు, యంగ్ హీరోలు సరికొత్త కథాంశాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. రీసెంట్ గా వరుసగా వివిధ జోనర్లలో వచ్చిన చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. కంటెంట్ ఉన్న సినిమాలకు జేజేలు కొడుతున్నారు. అయితే సీనియర్ హీరోలు ఇప్పటికీ ఒకటే పంథాను  కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందులాగా యాక్షన్, గ్లామర్ రోల్స్ కు సీనియర్ హీరోలు ప్రాధాన్యతనివ్వడం ఆడియన్స్ కు అంతగా నచ్చడం లేదు. వారి అభిమానులకు తప్ప మిగతా వాళ్లకు ఈ విషయంపై విమర్శలు చేస్తున్నారు. "ఖైదీ నెంబర్ 150"తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కాజల్ తో రొమాన్స్ చేశారు. అది చిరు ఎంట్రీ మూవీ కావడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత కూడా "సైరా"లో తమన్నాతో కలిసి నటించడం పట్ల పెదవి విరిచారు.


కింగ్ నాగార్జున విషయంలోనూ ఇలాగే జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ "మన్మధుడు"లో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది. నాగార్జున బాగా ఏజ్ ఉన్న వ్యక్తిలా కనిపించాడు. కానీ రకుల్ యంగ్ గా కనబడడంతో కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదు. ఇక మరో సీనియర్ హీరో బాలయ్యకైతే హీరోయిన్లు దొరకడమే కష్టం అయిపోయింది. రీసెంట్ గా "వకీల్ సాబ్"లోనూ పవన్ కళ్యాణ్ వయసు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్లలో పవన్ వయసు కాస్త ఎక్కువగానే అనిపించింది. దీంతో సీనియర్ హీరోలు ఇక ఇప్పటికైనా ఈ మూస ధోరణిని మార్చుకోరా ? అంటూ సినీ ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలతో, సరికొత్త జోనర్ లలో సినిమాలు చేస్తూ ఆహా అనిపించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం వీళ్ళు ఇంకా పాత ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. ఇటీవల సీనియర్ హీరో వెంకటేష్ ప్రయోగాత్మక చిత్రాలతో శభాష్ అనిపించుకున్నారు. దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ గా స్టార్ డంను ఎంజాయ్ చేస్తున్న సీనియర్ హీరోలు ఇప్పటికైనా రొమాంటిక్, యాక్షన్ మూవీలను పక్కనపెట్టి ప్రయోగాత్మక చిత్రాల పై దృష్టి సారించాలని మూవీ లవర్స్ ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: