చిరంజీవి ఈ రోజు మెగాస్టార్. ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున ఉంది. ఆయన ఎంతో మంది వర్ధమాన నటులకు ఆదర్శం. చిరంజీవి తెలుగు సినిమా నడకను మార్చేశారు. కమర్షియాలిటీకి సరికొత్త అర్ధం చెప్పారు. టాలీవుడ్ ని బాలీవుడ్ కి ధీటుగా తీసుకువచ్చారు.

అటువంటి మెగాస్టార్ మొదటి అడుగు ఎలా పడింది. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అన్నది అందరికీ తెలియాల్సిందే. చిరంజీవి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఉండగానే పునాది రాళ్ళులో అవకాశం దక్కింది. ఈ లోగా ప్రాణం ఖరీదులో ఆయన నటించారు. అది విడుదల అయింది. ఇక ఈ రెండు సినిమాల తరువాత చిరంజీవి అవకాశాల కోసం చూస్తున్నారు. అయితే ఆయన చాలా మంది నిర్మాతలను దర్శకులను  కలుస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో అప్పట్లో దాసరి నారాయాణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ధవళ సత్యాన్ని కూడా ఆయన కలిశారు. ధవళ సత్యం తొలి సినిమా జాతర. ఆయన ఆ మూవీకి మంచి కధను రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక ఆర్టిస్టుల ఎంపిక అన్నది చేయాలి. అయితే ఆయనకు అప్పటికే చిరంజీవితో పరిచయం ఉంది. తన మొదటి సినిమాలో ఈ అబ్బాయి హీరో అయితే బాగానే ఉంటుంది అనుకున్నారు. చిరంజీవిలోని ఆ చలాకీతనం,  పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యం ఇవన్నీ బాగా పసిగట్టిన ధవళ‌ సత్యం ఆయనే తన  హీరో అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇవేమీ తెలియని చిరంజీవి ఆయన్ని కలసి తనకు సినిమాలో కనీసం అయిదు సీన్లు ఉండే పాత్ర అయినా ఇస్తే చాలు అని అడిగారుట.

కానీ ధవళ సత్యం మాత్రం చిన్న పాత్ర కాదు, మా సినిమాకు నీవే హీరో అంటూ షాక్ ఇచ్చేశారుట. ఆ మూవీలో శ్రీధర్ చిరంజీవి అన్నదమ్ములుగా నటిస్తారు. విలన్ గా నాగభూషణం ఉంటారు. ఈ మూవీని గ్రామీణ నేపధ్యంలో  చాలా అద్భుతంగా  తీశారు ధవళ సత్యం.  మూవీ రిలీజ్ అయి వంద రోజులు ఆడింది. చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గ్రామాల్లో జరిగే అన్యాయాలను నిలదీసే యువకుడిగా చిరంజీవి నటిస్తారు. ఈ మూవీ తరువాత చిరంజీవి వెనక్కు చూసుకోలేదు. మరిన్ని అవకాశాలతో తొందరలోనే బిజీ హీరోగా మారిపోయారు. చిరంజీవి తనకు ఇప్పటికీ మంచి మిత్రుడు, రియల్ హీరో అని చెబుతారు ధవళ సత్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: