కరోనా మహమ్మారి వల్ల చాలా సినిమాల రిలీజ్ షెడ్యూల్ వాయిదా పడింది. అయితే భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ "రాధేశ్యామ్" అలా వాయిదా పడడం ఏకంగా ఐదు సినిమాలకు కలిసి వచ్చింది. ప్రభాస్, పూజ హెగ్డే నటించిన "రాధేశ్యామ్" జూలై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడిన షెడ్యూల్స్ కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరిగింది. ఇప్పుడు పలు టాలీవుడ్ మూవీస్ కు అదే కలిసొచ్చింది. జూలై 30న విడుదల కావడానికి 5 సినిమాలు రెడీగా ఉన్నాయి. 'తిమ్మరుసు', 'ఇష్క్', 'నరసింహాపురం', 'త్రయం', 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాయి.
 
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడిన థియేటర్లు జూలై 30 నుంచి కళకళలాడానికి సిద్ధమవుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు దృష్ట్యా థియేటర్లు ఓపెన్ చేస్తే... ఇప్పటికే కరోనా వల్ల భారీ నష్టాన్ని మూటగట్టుకున్న ఎగ్జిబిటర్లు ఇక దుకాణం ఎత్తేయాల్సి వస్తుందని ఇప్పటివరకూ థియేటర్లను రీఓపెన్ చేయలేదు. మరోవైపు నిర్మాతలు కూడా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా లేవని భావించి పలు సినిమాలను ఓటిటి వేదికపై రిలీజ్ చేశాయి. మరికొంతమంది మాత్రం తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ పట్టుబట్టుకు కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు వారం క్రితం ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ ను కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. వారి విన్నపం మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పుడు థియేటర్లు రీఓపెన్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీ, టికెట్ రేట్లు, అలాగే రోజుకు మూడు ఆటలు మాత్రమే అంటూ ప్రభుత్వం పెట్టిన కండిషన్లపై పంచాయితీ ఇంకా అలాగే ఉంది. అందుకే అక్కడ థియేటర్లు అప్పుడే తెరుచుకునేలా కన్పించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: