మన హీరోలు యాక్టింగ్ వదిలిపెట్టేస్తున్నారు.  లాయర్లు అయిపోవాలని తహతహలాడుతున్నారు. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల కోర్టుల చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. అందుకే లాయర్లు అయిపోతూ తెగ వాదించేస్తున్నారు మన హీరోలు.

పవన్‌ కళ్యాణ్ ఫస్ట్‌ టైమ్‌ 'లాయర్‌'గా నటించిన సినిమా 'వకీల్‌సాబ్'. వేణు శ్రీరామ్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చాడు పవన్. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌కి భిన్నంగా రూపొందిన ఈ కోర్ట్‌ రూమ్‌ డ్రామాకి థియేటర్స్‌తో పాటు, ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

టైటిల్‌తోనే సౌత్‌లో హైప్స్‌ క్రియేట్ చేసిన సినిమా 'జై భీమ్'. జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో సూర్య లాయర్‌గా నటిస్తున్నాడు. దళిత, గిరిజనుల తరపున పోరాటం చేసే నిస్వార్ధపు లాయర్‌ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు సూర్య. ఇక ఈ సినిమా సూర్య సొంత సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనే తెరకెక్కుతోంది.

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ కొట్టిన సినిమా 'జాతి రత్నాలు'. అనుదీప్‌ డైరెక్షన్‌లో నవీన్‌ పోలిశెట్టి, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి లీడ్ రోల్స్‌ ప్లే చేశారు. నాగ్ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా 40 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కోర్ట్‌ రూమ్‌ సీన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా వాదనలు, క్లైమాక్స్‌లో నవీన్‌ పోలిశెట్టి ఆర్గ్యుమెంట్స్‌కి బాక్సాఫీస్‌ ఖుషీ అయ్యింది.

అల్లరి నరేశ్‌ని వరుస ఫ్లాపుల నుంచి బయటపడేసిన సినిమా 'నాంది'. 'సుడిగాడు' తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న నరేశ్‌కి కోర్ట్‌ రూమ్ డ్రామా 'నాంది' బిగ్‌ రిలీఫ్ ఇచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్‌ 211 చుట్టూ తిరిగిన ఈ కథకి విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే లాయర్‌ ఆద్యగా నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సత్యదేవ్‌ కూడా ఇలాగే కోర్ట్‌రూమ్‌ డ్రామాతో సూపర్ హిట్‌ కొట్టాలనుకుంటున్నాడు. శరణ్‌ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో 'తిమ్మరుసు' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో లాయర్‌ క్యారెక్టర్ ప్లే చేశాడు సత్యదేవ్.

తెలుగు సినిమాల్లో కోర్ట్‌ రూమ్‌ డ్రామాస్‌కి హయ్యెస్ట్ సక్సెస్‌ రేట్‌ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ 'జస్టిస్ చౌదరి' నుంచి మొదలుపెడితే చిరంజీవి 'ఠాగూర్', వెంకటేశ్‌ 'ధర్మచక్రం', జూ.ఎన్టీఆర్ 'టెంపర్' ఇలా కోర్టుల చుట్టూ తిరిగిన చాలా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో తెలుగునాట కోర్ట్‌ రూమ్‌ డ్రామాస్‌ అనగానే కోట్లు తెచ్చిపెట్టే సినిమాలుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: