ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. దాంతో థియేటర్ల పై తీవ్ర ప్రభావం ప‌డుతోంది. థియేటర్ల యజమానులు... డిస్ట్రిబ్యూటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఓటీటీలో భారీ ఆఫర్ లు ఇవ్వడంతో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఆధునికత‌ సాంకేతికత ముందుకు వెళ్లడం సాధారణమేనని అన్నారు. సాంకేతికతలో వస్తున్న మార్పుల కారణంగానే తోలుబొమ్మలాట నుండి ఇప్పుడు సినిమాల వరకు సినిమాల నుండి ఇప్పుడు టీవీలు ఓటీటీలు వ‌చ్చాయ‌ని అన్నారు. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్త కళను చూస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయిందని అన్నారు. 

అదేవిధంగా ప్రొఫెసర్ అమర్త్యసేన్ చెప్పినట్టు అన్ని సాంకేతిక‌ ఫలాలు భూమిపై ఉన్న అట్టడుగు వర్గాల వారికి చేరినప్పుడే దానిని సాంకేతికీక‌ర‌ణ అంటార‌ని అన్నారు. క‌రోనా ప్రభావం కారణంగా జనసమూహం అవ్వకూడదని ఓటీటీలు వచ్చాయని దాన్ని తాను కూడా ఆహ్వానిస్తున్నాన‌ని అన్నారు. కానీ థియేర‌టర్లను కాపాడాల‌ని అన్నారు. నిర్మాత సురేష్ బాబు గారిని పెద్ద‌లంద‌రినీ కోరుతున్నాన‌ని సేవ్ సినిమా, సేవ్ థియేటర్స్ అని అన్నారు. థియేటర్లను కాపాడాలని కోరారు. నారప్ప సినిమా ను ఓటీటీలో విడుదల చేయడం వల్ల చాలా మంది ఆ సినిమాను చూడలేక పోయారు అని అన్నారు. అది థియేటర్లో విడుదల అయితే ప్రతి ఒక్కరికి సినిమా చేరేదని అన్నారు. 

తాను కూడా నార‌ప్ప సినిమాను చూడలేద‌ని..త‌న‌ లాంటివారు చూడకూడదా అని ప్రశ్నించారు. 25 శాతం మందికే ఓటీటీలు ఉన్నాయ‌ని 75 శాతం మంది పేదవార‌ని వారికి ఓటీటీలు ఉండ‌వ‌ని అన్నారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల వారికి కూడా ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చేవ‌ర‌కూ థియేట‌ర్లు ఉండాల్సిందేన‌ని అన్నారు.  సినిమా పండ‌గ అని అది థియేట‌ర్ల‌లోనే చూడాల‌ని అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎం ల‌కు థియేట‌ర్లు తెరిచేలా చూడాల‌ని అన్నారు.  విరాట‌ప‌ర్వం, ల‌వ్ స్టోరీ సినిమాలు థియేట‌ర్లల‌లోనే విడుద‌ల చేయాల‌న్నారు. నిర్మాత‌లు మార్గ‌ద‌ర్శులుగా ఉండాల‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: