ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ప్రజలు ఖుషీగా ఉన్నారు. లాక్ డౌన్ లో కూడా బాగానే సడలింపులు రావడంతో ప్రజలు కాస్త స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. షాపింగ్ లని, జాబ్ అని, పార్కులని మళ్లీ జనాలు బయటకు వస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరి పని వారు చూసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగానే జరుగుతోంది. ప్రజలు గతంలోలా టీకా తీసుకునేందుకు భయపడకుండా ముందుకొస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్న చిత్రాలు విడుదలయ్యేందుకు అన్నిటినీ సిద్దం చేసుకుని రెడీ అవుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే గత కొద్ది రోజుల నుండి మీడియాలో డెల్టా వేరియంట్ పై థర్డ్ వేవ్ పై పలు కథనాలు వెలువడుతున్నాయి. ముప్పు తప్పేలా లేదంటూ కలవరపెడుతున్నాయి.

ఇలాంటి క్రమంలో థియేటర్లు ఓపెన్ అయితే కరోనా మూడవ దశ తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటువంటి కథనాల నడుమ థియేటర్లు ఓపెన్ అవుతాయా ? ఒకవేళ అయినా జనాలు సినిమా థియేటర్స్ కు వస్తారా అన్న సందేహాలున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు ఎంత వరకు రిస్క్ చేసి రిలీజ్ చేస్తారన్న అనుమానాలు మొదలయ్యాయి. అంతే  కాకుండా మరో వైపు అగ్రరాజ్యంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది అని తద్వారా మళ్ళీ తెలుగు సినిమాలకు తిప్పలు తప్పవని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కానీ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు అంతా నిస్సందేహంగా థియేటర్లకు వచ్చి తమ అభిమాన తారల చిత్రాలను ఎంజాయ్ చేయొచ్చు అంటూ అంటున్నారు.

ప్రస్తుతం టికెట్ రేట్లు,  తదితర థియేటర్ల సమస్యలు ఓ కొలిక్కి వస్తే కేజిఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రాలు సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో థియేటర్లపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: