తెలుగు సినిమా పాట అంటే చెవులు కోసుకునే వారు ఉంటారు. ఆ పాటలో మాధుర్యం అంతలా ఉంటుంది. సరళమైన పదాలతో ఆకట్టుకునే సంగీతంతో తొలినాళ్ళలో తెలుగు పాట ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలుగు పాటకు భాషా సౌందర్యం కూడా అద్దిన కవులు వచ్చారు.

ఇక తరువాత కాలంలో బీట్ సాంగ్స్ మాస్ సాంగ్స్ వచ్చి సాహిత్యాన్ని పక్కకు నెట్టేశాయి. ఇదిలా ఉంటే తెలుగు సినిమా పాట ఒకనాడు దివ్యమైన వైభోగమే అనుభవించింది అని చెప్పాలి. తెలుగు సినిమా పాట రాయడానికి ఒక దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, ఆరుద్ర, నారాయణరెడ్డి, ఆత్రేయ, కొసరాజు,  దాశరధి పింగళి, వేటూరి వంటి మేటి కవులు ఎందరో ఉండేవారు. వీరి సాహిత్యపు విలువలతో తెలుగు పాట ఆనాడు  పట్టుబట్ట కట్టింది.

ఇదంతా ఎందుకు అంటే ఈ రోజు పాటలను చూసి అనే చెప్పాలి. ఇపుడు వస్తున్న పాటలలో అన్య భాషా పదాలు ఎక్కువ. పైగా ఎవరికీ అర్ధం కాదు, సంగీతమే దాన్ని వినిపించకుండా చేస్తుంది. ఇక మరో వైపు చూస్తే ఇతర భాషలకు చెందిన వారి గొంతులలో పడి తెలుగు పాట అర్ధమే కోల్పోయింది.  ఈ సందర్భంగా చిన్న తమాషాను కూడా చెప్పుకోవాలి.

ఆత్రేయ, వేటూరిల మధ్య  చక్కని స్నేహం ఉండేది. ఒకసారి వేటూరి పల్లవి రాసి వదిలేస్తే ఆ పాట చరణాలను ఆత్రేయ పూర్తి చేశారు. అదే గోరింటాకు చిత్రంలోని కొమ్మకొమ్మకూ సన్నాయి పాట. అచ్చం వేటూరి అనుకున్న భావాలనే ఆత్రేయ ఆ పాటలో పలికించారు. ఆ పాటని వింటే ఇది ఒక కవే రాశారా అనిపిస్తుంది తప్ప ఇద్దరు ఉద్దండులు అందులో ఉన్నారు  ఎవరూ అనుకోరు. మరి నాడు ఒక పాట సృష్టి చేయడానికి ఎంతలా తపించాలో తపస్సు చేయాలో అన్నీ చేయబట్టే పాటలు అలా పుట్టాయి. సజీవం అయ్యాయి. ఇపుడు వస్తున్న పాటలు అర్ధం కావు అని ఎవరైనా అంటే సినిమా పాటకు అర్ధాలేంటి లాజిక్ ఏంటి అని సమాధానం చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ సినిమా అయినా నాటకం అయినా జీవితం నుంచి పుట్టినవే. ఇక్కడ ఉన్న లాజిక్ అక్కడా ఉండాలి కదా. కానీ మ్యాజిక్ చేస్తూ సినీమాయగా మార్చేసున్న కధలలో పాటకు అంతే విలువ అనుకోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: