సత్యనారాయణ దీక్షిత్ అంటే ఎవరికీ తెలియదు. కానీ శరత్ బాబు అంటే అందరికీ గుర్తుకొచ్చేస్తుంది. అవును నిజం శరత్ బాబు అసలు పేరు.. సత్యనారాయణ దీక్షిత్. కె. ప్రభాకర్, కె.బాబూరావు చలన చిత్ర పరిశ్రమకు ఆయన్ను పరిచయం చేస్తూ శరత్ బాబుగా పేరు మార్చేశారు. శరత్ బాబు మొదటి సినిమా రామరాజ్యం. 1973వ సంవత్సరంలో వచ్చింది. ఆ తర్వాత కన్నె వయసు చిత్రంలో తన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఆయన టాలెంట్ ఏంటో తెలుగుచిత్ర పరిశ్రమకు తెలిసిపోవడంతో వరుస అకాశాలు రావడం మొదలుపెట్టాయి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేశారు. పంతులమ్మ, అమెరికా అమ్మాయి లాంటి చిత్రాల్లో జీవించేశారు. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు దర్శకుడు బాలచందర్ రూపొందించిన చిలకమ్మ చెప్పింది చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్నారు.

శరత్ బాబు ఏది ఏమైనా.. ఒక విలక్షణ నటుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఒక ఆణిముత్యం. ఆయన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు.. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా తన టాలెంట్ చూపించారు. అలా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో రకరకాల పాత్రల్లో జీవించేశారు.  

శరత్ బాబు సినీజీవితంలో తానేంటో నిరూపించుకున్నారు. అందుకు నిదర్శనం ఆయన మూడు సార్లు ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారాన్ని అందుకోవడమే. తొలిసారి సీతాకోక చిలుక, రెండోసారి ఓ భార్య కథ, ముచ్చటగా మూడోసారి నీరాజనం సినిమాలలో తన అద్భుత నటనకు గాను ఈ పురస్కారాలు వరించాయి.

శరత్ బాబు చలనచిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్న సమయంలో రమాప్రభ ప్రేమలో పడ్డారు. ఆమెకు పెళ్లి చేసుకున్నారు కూడా. శరత్ బాబు కంటే ఆమె నాలుగేళ్లు పెద్దదైనా.. వారి ప్రేమకు వయసు అడ్డంకి లేకుండాపోయింది. పద్నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో ఆనందాలను చవిచూసిన ఈ జంట ఆ తర్వాత విడిపోయింది.

అసలు శరత్ బాబు ఎక్కడ పుట్టారో చెప్పనే లేదు కదూ.. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో పుట్టారు. 1951వ సంవత్సరం జులై 31న తేదీన జన్మించారు. ఏది ఏమైనా శరత్ బాబుకు సినీలోకం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: