కరోనా సమయంలో చిన్న సినిమాలు చిత్ర పరిశ్రమను కొంతవరకు ఆదుకున్నాయి. సినీకార్మికులకు ఊపిరిపోశాయి. కరోనా ఫస్ట్‌ వేవ్‌ అన్‌లాక్‌లో థియేటర్లు రీ-ఓపెన్‌ చేశాక ముందు చిన్న సినిమాలే విడుదలయ్యాయి. స్టార్ హీరోలంతా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా.. రారా అనే డైలమాలో పడిపోయారు. ఇక వసూళ్ల పరిస్థితి ఏంటో అనే సందిగ్ధంలో ఉండిపోయారు. ఇలా తర్జన భర్జన పడుతున్న సమయంలో మీడియం బడ్జెట్‌ మూవీస్‌ బరిలో దిగాయి.

ఫిబ్రవరిలో వాలెంటైన్స్‌డే సందర్భంగా విడుదలయిన 'ఉప్పెన' సినిమాతో బాక్సాఫీస్‌కి మరింత జోష్ వచ్చింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ఈ సినిమాకి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సెన్సిబుల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి 70 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఈ హిట్‌తో బుచ్చిబాబు రేంజ్ కూడా మారిపోయింది.

ఫస్ట్‌ వేవ్‌ తర్వాత చిన్న సినిమాలు ఆడియన్స్‌ని థియేటర్లకి రప్పించగానే, టాప్ హీరోలు అప్రమత్తమయ్యారు. ఏప్రిల్‌ సెకండ్‌ వీక్‌లో పవన్‌ కళ్యాణ్ 'వకీల్‌సాబ్' రిలీజ్ చేశాడు. ఇక చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలంతా మే నెలలో బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. అయితే పెద్ద హీరోలు అలా డేట్స్‌ ప్రకటించింది షూటింగ్‌లో బిజీ అయ్యారో లేదో సెకండ్ వేవ్ వచ్చింది. థియేటర్లని మూతపడేట్టు చేసింది.

థియేటర్ల రీఓపెనింగ్‌కి పర్మీషన్‌ ఇచ్చాక కూడా చాలా సినిమాలు విడుదలకు దూరంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలు వేరే ఉన్నాయని సినిమాలు రిలీజ్ చేయలేదు. అయితే థియేటర్లకు దూరంగా ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం కావనుకున్నారో ఏమో ముందుగా చిన్న సినిమాలతో ప్రయోగాలు మొదలయ్యాయి.

తేజ సజ్జా 'ఇష్క్', సత్యదేవ్ 'తిమ్మరుసు' సినిమాలు శుక్రవారం బరిలో దిగాయి. అలాగే వచ్చే వారం 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' వస్తోంది. సో ఇప్పుడు కూడా చిన్న సినిమాలతోనే థియేటర్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ చిన్న చిత్రాలు థియేటర్లకి జనాలని రప్పించి, అంతా ఓకే అనుకుంటే అప్పుడు పెద్ద సినిమాలు బరిలో దిగుతాయని చెప్పొచ్చు. చూద్దాం.. చిన్న సినిమాలను చూసైనా స్టార్ హీరోలు మారతారేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: