కామెడీ కింగ్ అల్లు రామలింగయ్య తెర మీద కనిపిస్తే చాలు నవ్వులు పూయాల్సిందే. తన చక్కటి నటన, కామెడి టైమింగ్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన నటుడు అల్లు రామలింగయ్య. తన చిలిపి మాటలు, ఆహార్యంతో సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా సరదాగా ఉండేవాడు. ఈ క్రమంలోనే తోటీ నటీనటులు, హీరోలతో బోలెడన్ని జోక్స్ వేసేవారట. కాగా, అల్లు రామలింగయ్యను సూపర్ స్టార్ కృష్ణసినిమా సందర్భంగా ఆటపట్టించాడు. వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణతో పాటు కామెడీ కూడా జరిగిందట. అదేంటో ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.

మద్రాసు వాహిని స్టూడియోస్‌లో ‘ప‌గ‌బ‌ట్టిన సింహం’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఈ చిత్రంలో హీరోగా కృష్ణ‌ నటించగా, ఇందులో ఓ పాత్రలో అల్లు రామలింగయ్య నటించారు. ఇక సినిమాలోని ‘చందమామతో బిళ్లంగోడు ఆడిన‌ట్లు దిక్కుల‌న్నీ అదిరిప‌డ్డ‌వి’ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది అప్పుడు. కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌, గీత‌, జ్యోతిల‌క్ష్మికి డ్యాన్స్ మూమెంట్స్ వివరిస్తున్నాడు కొరియోగ్రాఫర్ శ్రీను. ఈ సందర్భంలో అక్కడికి లాల్చీ వేసుకుని భుజం మీద కండువాతో వచ్చాడు అల్లు రామలింగయ్య. ‘ప్రేమాభిషేకం’ గెట‌ప్‌‌లో పాపారాయుడిలా వచ్చాడు. ఆ గెటప్ చూసి కృష్ణ..హీరో కావాలనుకుంటున్నావా? రామారావు, నాగేశ్వరరావుకు చెప్తాను ఉండండి అంటూ అల్లు రామలింగయ్యను ఆటపట్టించాడు.  ప్రతిగా అల్లు రామలింగయ్య మాట్లాడుతూ..అయ్యా మీరు హీరోలు, మేం కమెడియన్లం అని చెప్పాడు. ‘సినిమాల్లో ఎలాగూ ఏడిపిస్తారు. ఇక్కడ కూడా ఏడిపిస్తారా’ అంటూ మందు తాగిన వాడిలా నటిస్తూ మాట్లాడాడు అల్లు రామలింగయ్య. ఈ మాటలు విన్న డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ‘రామలింగయ్య గారు మీ షాట్ ఇంకా అరగంట తర్వాత ఉందండి..అప్పుడే తాగుబోతు మూడ్‌లో ఉండాల్సిన అవసరం లేదు’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృష్ణ ‘ఏంటీ ఈయ‌న తాగుబోతుగా నటిస్తూ పాటపాడుతాడా?’ అంటూ నవ్వాడు. మొత్తంగా కృష్ణ, అల్లు రామలింగయ్య, డైరెక్టర్ మధ్య సంభాషణలతో సెట్‌లో నవ్వులు పూశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: