తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప నటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇలా ఎంతో మంది ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని గుర్తుగా మిగిలిపోతారు. ఆ గొప్పనటులలో ఒకరే స్వర్గీయ అల్లు రామలింగయ్య.  ఆయన 1922 అక్టోబర్ 1 న  పశ్చిమగోదావరి లోని పాలకొల్లులో జన్మించాడు. రామలింగయ్య కు చిన్నప్పటి నుండి నటనంటే చాలా ఆసక్తి. కానీ తన ఆర్ధిక పరిస్థితుల కారణంగా అనుకున్న విధంగా నాటకాలలో నటించే అవకాశం లేకపోయింది. కానీ వాస్తవానికి అల్లు రామలింగయ్య తాత సుబ్బారాయుడికి చాలా ఆస్తులుండేవి. కానీ వివిధ కారణాల వలన అవి క్రమక్రమంగా తరిగిపోయాయి. ఊర్లోకి ఎవరు నాటకాలు వారు వచ్చినా కూడా వారి వెంటే తిరిగే వాడు. ఆ నాటకాల వారితో పరిచయాన్ని పెంచుకుంటూ, తద్వారా నాటకాల అవకాశాలను ఇమ్మని అడిగేవాడు. అలా కొద్ది రోజుల తరువాత భక్త ప్రహ్లాద నాటకంలో భాగంగా బృహస్పతి అనే పాత్రలో నటించాడు.
ఈ అవకాశం కూడా అల్లు రామలింగయ్యే నాటకాల వారికి మూడు రూపాయలు ఇవ్వడం ద్వారా పొందాడు. అయితే ఇలా డబ్బులిచ్చి వేషాన్ని పొందిన సంగతి ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే డబ్బులిస్తే పని అవుతుందని తెలుసుకున్న అల్లు రామలింగయ్య. నాటకాలలో మరిన్ని అవకాశాలు పొందడానికి చేతిలో డబ్బులు లేని సమయంలో ఇంట్లో ఉన్న బియ్యాన్ని దొంగతనంగా తీసుకెళ్లి వాటిని డబ్బుగా మర్చి నాటకాలను నిర్వహించే కాంట్రాక్టర్ కు ఇచ్చాడు. ఆ విధంగా నాటకాలలో తనకు బీజం పడింది. ఈయన నాటకాలను చూసిన గరికపాటి రాజారావు 1952 సంవత్సరంలో 'పుట్టిల్లు' అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా మొదలైన సినీ జీవితంలో ఎన్నో కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు.
ఒక మంచి నటుడిగా, హాస్యం పండించడంలో తనదైన శైలితో ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లు రామలింగయ్య మొత్తంగా 1030 చిత్రాల్లో నటించాడు. సినిమా పరిశ్రమకు ఇతను చేసిన సేవలకు గానూ భారతదేశ ప్రభుత్వం మెచ్చి 1990 సంవత్సరంలో "పద్మ శ్రీ" అవార్డుతో సత్కరించింది. అలా జీవిత కాలం నవ్వుతూ నవ్విస్తూ బ్రతికిన అల్లు రామలింగయ్య 2004 జులై 31 వతేదీన పరమపదించాడు. ఈ రోజుకీ ఆయనను చిత్ర పరిశ్రమ స్మరించుకుంటూ ఉందంటే ఆయన గొప్పతనం ఏమిటో అర్ధమవుతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: