తెలుగు సినిమాల‌కు సంబంధించి సంక్రాంతి అంటే హ‌డావిడి ఎక్కువ‌గా ఉంటుంది. సెల‌వులు ఎక్కువ‌గా ఉండ‌టం.. ఆ సమ‌యంలో ఉద‌యం ఆట‌నుంచి సెకండ్ షో వ‌ర‌కు ఏ ఆటైనా హౌస్‌ఫుల్ అవుతుంది.. క‌లెక్ష‌న్లు కూడా దండిగా ఉంటాయి.. ఇబ్బంది లేకుండా వారం రోజుల్లో సినిమాకు సంబంధించిన పెట్టుబ‌డి కూడా తిరిగి వ‌స్తుంద‌నే సినిమా నిర్మాత‌ల ఆలోచ‌న‌గా ఉంటుంది. అందుకే పెద్ద క‌థానాయ‌కుల నుంచి చిన్న క‌థానాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ సంక్రాంతిపై గురిపెడ‌తుంటారు. ఆ స‌మ‌యంలోనే త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని కోరుకుంటుంటారు. చాలామంది క‌థానాయ‌కుల‌కు సంక్రాంతి అంటే ఒక సెంటిమెంటులా మారింది. ఆ స‌మ‌యంలో విడుద‌ల చేసిన సినిమాల‌న్నీ సూప‌ర్‌హిట్ అవ‌డ‌మే అందుకు కార‌ణం. సాధార‌ణంగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంక్రాంతి హీరో అంటే సూప‌ర్‌స్టార్ కృష్ణ గురించి చెబుతారు. తాజాగా ఆయ‌న సంక్రాంతి వార‌స‌త్వాన్ని త‌న‌యుడు మ‌హేష్‌బాబు అందిపుచ్చుకున్నారు.

ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు
రాబోయే సంక్రాంతికి త‌మ సినిమాలు విడుద‌ల‌వుతాయ‌ని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి అగ్ర‌క‌థానాయ‌కుల సినిమాల‌న్నీ సంక్రాంతికి రాబోతున్నాయి. దీంతో ధియేట‌ర్ల స‌మ‌స్య ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ గా ఉన్న కొన్ని ధియేట‌ర్లు వాణిజ్య స‌ముదాయాలుగా, ఫంక్ష‌న్ హాళ్లుగా మారిపోయాయి. సంక్రాంతి స‌మ‌యానికి ఎన్ని అందుబాటులో ఉంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఉన్న ధియేట‌ర్ల కోసం పోటీప‌డాల్సిన ప‌రిస్థితి క‌థానాయ‌కుల మ‌ధ్య క‌న‌ప‌డుతోంది.

ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న ధియేట‌ర్లు
ఇప్పుడిప్పుడే ధియేట‌ర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. క‌లెక్ష‌న్లు కూడా నెమ్మ‌దిగా పెరుగుతున్నాయి. అయితే క‌రోనా మూడోద‌శ అంటున్నారు. నాలుగో ద‌శ అంటున్నారు. ఈ ద‌శ‌ల‌న్నింటినీ త‌ట్టుకొని సంక్రాంతి స‌మ‌యానికి వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియ‌దు. క‌థానాయ‌కులు మాత్రం సంక్రాంతికి పోటీప‌డ‌టానికి సిద్ధ‌ప‌డ్డారు. ధియేట‌ర్లు చాలావ‌ర‌కు మూత‌ప‌డుతున్న స‌మ‌యంలో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుద‌ల‌చేస్తే ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌నం ఉంటుందో నిర్మాత‌లు, క‌థానాయ‌కుల‌కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag