జగ్గూ భాయ్... దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, సపోర్టింగ్ రోల్ లో, చివరకు విలన్ గా మొత్తానికి నవరసాలూ పండించిన నటుడు. ఇన్నేళ్లల్లో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డ నటుడు. శుభలగ్నం, మావిచిగురు, పెళ్లిపీటలు వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ముఖ్యంగా మహిళా అభిమానులను తనవైపుకు తీసుకున్నాడు. దీంతో జగపతి బాబు ఫ్యామిలీ మ్యాన్ గా మారాడు. జగపతి బాబు సినిమా అంటే ఫ్యామిలీ అంతా సంతోషంగా కలిసి చూడొచ్చు అనే అభిప్రాయం ఉండేది. అలాగని ఆయన కేవలం కుటుంబ కథా చిత్రాలకే పరిమితం కాలేదు. అంతఃపురం, గాయం, మనోహరం, సముద్రం, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు.

ప్రముఖ నిర్మాత, దర్శకుడు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత వి. బి. రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతి బాబు. తండ్రే నిర్మాత అయినప్పటికీ తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఆయనకు తెలియకుండానే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఎలాగోలా తెలుగుకున్న ఆయన 1989లో "సింహస్వప్నం" సినిమా ద్వారా జగపతి బాబును ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "గాయం" సినిమాతో హిట్ కొట్టి హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. వరుసగా ఫ్యామిలీ ఎంటర్తైనర్లతో హ్యాపీగా కాలాన్ని నెట్టుకొస్తున్న మన ఫ్యామిలీ మ్యాన్ ఒకానొక సమయంలో డౌన్ అయిపోయాడు. దీంతో అప్పటివరకూ హీరోగా కొనసాగిన ఆయన సపోర్టింగ్ రోల్స్ కూడా చేయడం మొదలెట్టాడు. ఇక ఇండస్ట్రీలో జగపతి బాబు అయిపోయిందని అంతా అనుకుంటున్నా తరుణంలోనే జగపతిబాబు బౌన్స్ బ్యాక్ అయ్యి విలన్ గా టర్న్ తీసుకున్నాడు. బాలయ్య "లెజెండ్"లో బీస్ట్ రూపంలో కన్పించాడు. విలన్ గా ఆయన ఉగ్రరూపం చూసిన దర్శకనిర్మాతలు మళ్ళీ వరుస ఆఫర్లతో జగపతిబాబు ఇంటిముందు క్యూ కట్టారు. అలా జగపతిబాబు నుంచి జగ్గూ భాయ్ గా మారిపోయాడు. దీంతో తెలుగులోనే కాకుండా తమిళం వంటి ఇతర భాషల్లో కూడా ఆయనకు మంచి అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది ఫ్యామిలీ మ్యాన్ బ్యాడ్ బాయ్ గా మారి వెండితెరను దడలాడించాడు. ఇప్పటికీ, ఎప్పటికి తెలుగు తెరపై ఈ తరం పవర్ ఫుల్ విలన్ అంటే జగ్గూ భాయ్ అనే చెప్పాలి. ఎంతోమంది పరభాషా నటులు విలన్లుగా నటిస్తున్నా మన జగపతిబాబుకు సాటిరారు. రంగస్థలం, శ్రీమంతుడు వంటి చిత్రాల్లో ఆయన నటన నటన ఐకానిక్ గా నిలిచిపోతుంది. ఇప్పటికే ఆయన 100 సినిమాలకు పైగానే నటించారు. ఏకంగా ఏడుసార్లు నంది అవార్డు అందుకున్న ఏకైన నటుడు జగ్గూభాయ్ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: