ఒక సినిమా తీయాలంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అలాగే ఒక ఆలోచన నుంచి కూడా సినిమాలు పుట్టుకువస్తాయి. అదే విధంగా ఆవేశం నుంచి కూడా సినిమాలు వస్తాయి. అయితే ఇద్దరు అగ్ర హీరోలతో మల్టీ స్టారర్ తీయడం అంటే మామూలు విషయం కాదు.

అది కూడా వారు మంచి ఫామ్ లో ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అటూ ఇటూ కత్తులు దూసుకుంటున్న టైమ్ అది. వారే ఎన్టీయార్, అక్కినేని, ఈ ఇద్దరు తెర వెనక మంచి మిత్రులు అయినా అభిమానులు మాత్రం కొట్టుకునేవారు. ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేవారు. ఇక ఒక హీరో పోస్టర్ మీద మరో హీరో ఫ్యాన్స్ పేడ ముద్దలు వేసేవారు. దాంతో ఈ యుద్ధం దారుణంగా ఉండేది.

ఒకసారి ప్రముఖ నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ ఇలా అగ్ర హీరోల పోస్టర్ల మీద పేడ ముద్దలు వేయడాన్ని చూసి చాలా బాధపడ్డారుట. ఆయనకు ఎన్టీయార్, అక్కినేనితో మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఆయన తెర వెనక బాగా ఉండే ఇద్దరు హీరోల స్నేహాన్ని తెర ముందు పెడితే అభిమానులు కూడా అన్నదమ్ముల్లా కలసి ఉంటారనుకుని ఒక సినిమా ప్లాన్ చేశారుట.

అదే రామక్రిష్ణులు మూవీ. ఈ సినిమాలో ఎన్టీయార్, అక్కినేని మంచి హుషారుగా నటిస్తారు. ఇద్దరూ ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అన్నట్లుగా కనిపించరు. ఇక పాటలు కూడా ఇద్దరి మీదనే తీసి ఎక్కడా తేడా రాకుండా దర్శకుడు కూడా అయిన రాజేంద్రప్రసాద్ చూసుకున్నారు. ఈ మూవీలో హీరోయిన్లుగా ఆనాడు నంబర్ వన్ రేసులో ఉన్న జయసుధ, జయప్రదలను తీసుకున్నారు. సినిమా తీరా రిలీజ్ చేస్తే అనుకున్న సక్సెస్ రాలేదుట. తాను మంచి ఉద్దేశ్యంతో ఈ సినిమా తీస్తే అభిమానులు మాత్ర అంతలా ఆదరించలేదని బతికి ఉన్న రోజుల్లో రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ మూవీలో కధ ఉండదు కానీ ఎన్టీయార్, ఏయన్నార్ ల అభిమానం, అనుబంధమే కనిపిస్తుంది. బహుశా అందుకే ఆకట్టుకోలేకపోయింది అని కూడా అంటారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: