ఆయన సామాన్య నటుడు కాడు, తెలుగు తెర మీద నాడు అగ్ర నటులుగా పోటా పోటీగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్ టైమ్ లో ప్రవేశించి తన సత్తా చాటుకున్న మేటి హీరో. తెలంగాణా నుంచి టాలీవుడ్ కి వెళ్ళి స్టార్ హీరోగా సత్తా చాటిన ఘనాపాటి. ఆయనే కత్తుల కాంతారావు అని అంతా ముద్దుగా పిలుచుకునే తాడేపల్లి లక్ష్మీ కాంతారావు.


ఆయన 1951లో ప్రతిజ్ఞ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. జానపదాల్లో కాంతారావుకు సరిసాటి ఎవరూ లేరు అని పేరు. ఆయన కత్తి పడితే చాలు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేవారు. కాంతారావు విఠలాచార్య కాంబోలో అప్పట్లో ఎన్నో మూవీస్ వచ్చి సూపర్ డూపర్ హిట్లు కొట్టాయి.


ఇక పౌరాణికాలలో కూడా కాంతారావుకు మంచి ప్లేస్ ఉంది. ఆయన నారదుడుగా తనదైన మార్క్ ని చూపించారు. ఎన్నో సినిమాల్లో ఆ పాత్రను పోషించి దాని మీద పేటెంట్ హక్కులు తనవే అని చెప్పేశారు. అలాగే లవకుశ మూవీలో లక్ష్మణుడు అంటే కాంతారావే అనిపించేలా చేశారు. ఇదిలా ఉంటే కాంతారావు సాంఘికాల్లో కూడా రాణించారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి నాడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు.


అటువంటి కాంతారావు 1969 చివరలో నిర్మాతగా మారిన తరువాతనే జాతకం మారింది. ఆయన తొలిసారిగా తీసిన సప్త స్వరాలు మూవీ బాగున్నా కూడా నాడు ఆంధ్రా తెలంగాణా ఉద్యమ ఫలితంగా బోల్తా కొట్టింది. ఆ తరువాత ప్రేమ జీవులు మూవీ తీస్తే అది కూడా ఫ్లాప్ అయింది. అదే వరసలో మరో మూడు సినిమాలు తీసి ఆయన చేతులు కాల్చుకున్నారు. మొత్తానికి కాంతారావు హీరోగా సంపాదించినది అంతా కూడా నిర్మాతగా పోగొట్టుకున్నారనే చెప్పాలి. ఏది ఏమైనా ఆయన చివరి రోజుల్లో ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు. ఆయన కళామతల్లికి చేసిన సేవలకు గానూ కనీసం పద్మ పురస్కారం కూడా దక్కలేదని అభిమానులు బాధపడతారు. కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఆయన తిరుగులేని నటుడే. వెండి తెర మహారాజే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: