చిత్ర పరిశ్రమ అంటే బహు చిత్రం. ఇక్కడ ఎన్నో విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. బయట చూసేవారికి అంతా బాగుంది అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న వారికి మాత్రం అంతా ఉల్టా సీదాగా ఉంటుంది. దేవుడు అందరి జాతకాలు రాస్తారు అంటారు. కానీ చిత్ర సీమలో నటీనటుల జాతకాలను మాత్రం అక్కడి మేకర్స్ రాస్తారు.

ఆ విధంగా చూసుకుంటే హీరోగా అవుదామని వచ్చిన వారు విలన్లుగా వేషాలు వేశారు. విలన్లు అవుతారు అనుకున్న వారు హీరోలు అయ్యారు. ఇక ఏదో చిన్న పాత్ర దక్కుతుంది చాలు అనుకున్న వారు హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇవన్నీ కూడా చిత్ర సీమ అందించిన జాతకాలే. ఇది ఎప్పటి నుంచో సాగుతున్న వైనమే. అప్పట్లో అంటే 1950 దశకంలోనే కాంతారావు, రాజనాల ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ప్రతిజ్ఞ అన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదట రాజనాలను హీరోగా అనుకుని తరువాత విలన్ని చేశారు. ఆ తరువాత ఆయన విలన్ గానే సెటిల్ అయ్యారు. కాంతారావు హీరోగా రాణించారు.

అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు అదృష్టదీపకుడు సినిమాతో హీరోగానే ఎంట్రీ ఇచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. కానీ ఆయన హీరోగా మళ్ళీ చేయలేదు. ఇక  సిపాయి కూతురుతో సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా హీరో అవుదామనుకుంటే అది తప్ప అన్నీ చేశారు. ఇక 1973లో వచ్చిన జగమే మాయలో మొదట హీరో గిరిబాబు. అయితే తరువాత మురళీమోహన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన్ని హీరోగా పెట్టి గిరిబాబుని విలన్ని చేశారు. దాంతో గిరిబాబు విలన్ అని పేరు తెచ్చుకున్నారు.

ఇక ఇదే రకమైన కధ శరత్ బాబు విషయంలో కూడా జరిగింది. ఆయన నవశక్తి మూవీస్ వారి నీడలేని ఆడది సినిమాకు మొదట హీరోగా సెలెక్ట్ అయ్యారు. అయితే తరువాత నరసింహరాజు ఎంట్రీ ఇవ్వడంతో ఆయన్ని ఆ సినిమాలో హీరోగా తప్పించి ఈయనకు చాన్స్ ఇచ్చారు. శరత్ బాబుని లెక్చరర్ పాత్రకు సెలెక్ట్ చేశారు. స్టూడెంట్ గా నరసింహరాజు అయితే బాగుంటాడని మేకర్స్ భావించడం వల్లనే శరత్ బాబు ఒక చాన్స్ మిస్ అయ్యారన్న మాట. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మొత్తానికి హీరో అని ఎవరైనా అనుకుంటారు. అది కాదు అంటే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. ఏది ఏమైనా కూడా చిత్ర సీమ కాబట్టి ఆ చిత్రాలు అందరూ భరించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: