కరోనా సెకండ్‌ వేవ్‌ కొంచెం తగ్గుముఖం పట్టగానే సినిమా ఇండస్ట్రీకి ఉపశమనం లభించింది. థియేటర్లు తెరుచుకుంటాయి, సినిమాల పండగ వస్తుందని బాక్సాఫీస్‌ కూడా ఆనంద పడింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం థియేటర్ విడుదల కంటే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కే ప్రాధాన్యత  ఇస్తున్నారు. ఇటీవల రాజ్‌కుమార్ రావు, కృతిసనన్‌ లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన 'హమ్‌ దో హమారే దో' సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల చేస్తున్నారు.

తాప్సీ చాలా కష్టపడి చేసిన సినిమా 'రష్మీ రాకెట్'. క్రీడల కథాంశంతో రూపొందిన ఈ సినిమా కోసం తాప్సీ జిమ్ లలో గంటల కొద్దీ కష్టపడింది. రన్నింగ్‌ ట్రాక్‌పై కిలోమీటర్ల కొద్దీ రన్ చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే సెట్స్‌లో ఉండగానే ఆసక్తి పెంచిన ఈ సినిమాని అక్టోబర్‌ 15న డైరెక్ట్‌గా జీ ఫైవ్‌లో విడుదల చేస్తున్నారు.

ఇక విక్కీ కౌశల్‌ 'సర్దార్ ఉద్ధమ్ సింగ్' సినిమాపై చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. ఫ్రీడమ్ ఫైటర్‌ ఉద్ధమ్ సింగ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాతో 'ఉరి' లాంటి వసూళ్లు అందుకుంటానని ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా డిజిటల్‌ విడుదలకు వెళ్తోంది. అక్టోబర్ 16న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లు రీ-ఓపెన్ అయ్యాక అక్షయ్ కుమార్ 'బెల్‌బాటమ్' సినిమా రిలీజ్ చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. వంద కోట్లు మార్క్ చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉండటంతో 'బెల్‌ బాటమ్' డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకు భారీ నష్టాలొచ్చాయి.

కంగన రనౌత్‌ 'తలైవి' సినిమాకి సూపర్ రివ్యూస్‌ వచ్చాయి. జయలలిత బయోపిక్‌లో అద్భుతంగా నటించిందని, జయలలితకి ఈ సినిమా పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని విమర్శకులు కూడా ప్రశంసించారు. కానీ ఈ కాంప్లిమెంట్స్‌కి తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. ఫిఫ్టీ పర్సంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవ్వడం, కరోనా థర్డ్ వేవ్ భయంతో జనాలు ఇంటికే పరిమితమవడంతో తలైవి కూడా వసూళ్ల వేటలో వెనకబడింది. వసూళ్లు లేని సమయంలో థియేటర్‌ ల వైపు మొగ్గు చూపి.. నష్టాల బాట పట్టే కంటే.. మంచి ఆఫర్‌ ఇస్తోన్న ఓటీటీలో డైరెక్ట్‌గా సినిమా విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నారు. అందుకే చాలామంది నిర్మాతలు ఓటీటీ స్ట్రీమింగ్‌ వైపే ఆసక్తి చూపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: