రిప‌బ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చేసిన వ్యాఖ్య‌ల దుమారం ఇంకా చ‌ల్లార‌లేదు. ఒక్కొక్క‌రుగా మీడియా ముందుకువ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో మంత్రులు.. వ‌రుస పెట్టి న‌లుగురు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఇక‌, ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో అనూహ్యంగా డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు గురించి కూడా మాట్లాడిన విష‌యం తెలిసిందే. కేవలం వ్యాఖ్య‌లే కాకుండా.. మంచు కుటుంబానికి, జ‌గ‌న్ కుటుంబానికి మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌ను కూడా ఏకేశారు. దీంతో ఇప్పుడు మంచు ఫ్యామిలీని ప‌వ‌న్ అడ్డంగా బుక్ చేశారా? అనే సందేహాలు ఇండ‌స్ట్రీలోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఒకింత లేటుగా స్పందించారు. అయితే.. ఘాటుగానే వ్యాఖ్య‌లు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోహన్బాబు.. అన్నిటిక‌న్నా ముందు `మా ఎన్నిక`ల్లో తమ కుమారుడు మంచు విష్ణుప్యానెల్‌కు  ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ``నా చిర‌కాల మిత్రుడు చిరంజీవి.. సోద‌రుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నువ్వు నాక‌న్నా వ‌య‌సులో చిన్న‌వాడివి. అందుక‌ని ఏక‌వ‌చ‌నంతో సంబోధించాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు అన‌డంలోనూ త‌ప్పులేదు.  చాలా కాలానికి న‌న్ను  మెల్ల‌గా లాగావ్‌. సంతోష‌మే. ఇప్పుడు మా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ్‌.

నా కుమారుడు మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా నిల‌బ‌డ్డాడు. ఈ సంగ‌తి నీకు తెలుసు. అక్టోబ‌రు 10న ఎన్నిక‌లు అయిపోతాయి. అప్పుడు నువ్వు అడిగిన ప్ర‌తి మాట‌కు హృద‌య పూర్వ‌కంగా స‌మాధానం చెబుతాను. ఈ లోగా నువ్వు చేయ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన ప‌ని.. నీ అమూల్య‌మైన ఓటును నీ సోద‌ర స‌మానుడైన విష్ణుబాబుకు, వాళ్ల ప్యానెల్‌కు వేసి వాళ్ల‌ను గెలిపించాల‌ని కోరుకుంటున్నాను`` అని లేఖ రాశారు.

అయితే.. ప‌వ‌న్ త‌న వ్యాఖ్య‌ల్లో మంచు మోహ‌న్‌బాబును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌కు మంచు మోహ‌న్‌బాబు కుటుంబానికి మ‌ధ్య స్నేహ‌మే కాకుండా.. కుటుంబ సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఆన్‌లైన్ సినిమా విక్ర‌య విష‌యంపై ఆయ‌న కూడా స్పందించాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే.. ఈ రోజు సినిమా టికెట్ల వ్య‌వ‌హారం వ‌చ్చింద‌ని... రేపు.. మోహ‌న్ బాబు విద్యా సంస్థ‌ల మీద‌కు కూడా వ‌స్తుంద‌ని.. హెచ్చ‌రించారు. ఎప్పుడూ.. ఏదో ఒక విష‌యంలో మాట్లాడే.. మోహ‌న్‌బాబు.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో.. త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌న్నారు.

అయితే.. ప‌వ‌న్ వ్యూహం.. డిఫ‌రెంట్‌గా ఉంది. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న మంచు కుటుంబాన్ని బ‌య‌ట‌కు లాగ‌డం ద్వారా.. రాజ‌కీయంగా వ్యూహం ప‌న్నారా?  అనే సందేహాలు వ‌స్తున్నాయి. నిజానికి కొన్నాళ్ల కింద‌ట చిరంజీవి, నాగార్జున, ద‌గ్గుబాటి కుటుంబం కూడా జ‌గ‌న్‌ను క‌లిసి. వారిని కూడా చంద్ర‌బాబు బ‌య‌ట‌కు లాగాలి. కానీ, వారిని వ‌దిలేసి.. ఒక్క మంచు కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నార‌నేదిప్ర‌శ్న‌. ఏదేమైనా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల ర‌గ‌డ ఇప్ప‌ట్లో పోయేది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: