మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలల్లో కూడా ఓటుకు నోటు మొదలైందంటున్నారు. ఇప్పటికే విందు రాజకీయాలు నడిచిన ఈ ఎన్నికల్లో ఇప్పుడు నోటు రాజకీయం న‌డుస్తోంది. మా ఎన్నికలని ఈ సారి ఇరు వర్గాలు చాలా సీరియస్ గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వార్ హాట్ హాట్ గా నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఓ వర్గం ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్ల‌ను మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

విందు రాజ‌కీయాలు.. ఓటు రాజ‌కీయాలు
విందు రాజ‌కీయాల‌తోపాటు తాజాగా ఓటుకు నోటు కూడా చేరింది. రెండు వర్గాల్లో ఓ వర్గం ఓటుకు దాదాపు రూ. 10 వేలు ఇచ్చి కొనుగోలు చేస్తోంద‌ని అంత‌ర్గ‌తంగా చెబుతున్నారు. ఓటర్లు చేజారిపోకుండా ఉదయం సాయంత్రం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజులు పెట్ట‌డంతోపాటు ఖాతా నెంబ‌ర్లు సేకరించి నేరుగా ఖాతాలోకి పదివేల రూపాయిలు పంపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ‘మా’ లో దాదాపు 600మందికి పైగా ఓట‌ర్లు ఉండ‌గా, ఇందులో 400 మందికి మంది పేరు, పరపతి ఉంది. మిగతా 200 మంది ఓటుకు నోటు ప్రలోభానికి లోనయ్యే అవకాశం వుందని ఓ వ‌ర్గం లెక్క‌క‌ట్టింది. వారిని సంప్రదించి క‌చ్చితంగా ఓటు తమకే వేయాలని, ఎకౌంట్ నెంబర్ అడిగి ఫోన్ పేలు, గూగుల్ పే లు చేస్తున్నారంటున్నారు.

దూరంగా ఉన్న‌వారికి ర‌వాణాఖ‌ర్చు
అలాగే హైదరాబాద్‌కు దూరంగా వున్న కొంతమంది ఓటర్లని ఓటు వేయడానికి రావాల్సిందిగా కోరుతున్నారు. వారికి పది వేల రూపాయ‌ల‌తోపాటు ప్రయాణ ఖర్చులు, వసతిని కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. మొత్తానికి ‘మా’ ఎన్నిక ఒక అసెంబ్లీ ఎన్నికని తలపిస్తోంద‌ని, ఓటుకు రూ. 10 వేలు ఖ‌ర్చుపెడుతున్నారంటే 200 మందికి క‌లిపి రూ.20 ల‌క్ష‌లు, ర‌వాణా ఖ‌ర్చులు క‌లుపుకుంటే దాదాపుగా 25 లక్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేయ‌డానికి ఒక వ‌ర్గం సిద్ధ‌మైపోయింది. మ‌రి ఎవ‌రు ఎవ‌రికి ఓటు వేస్తారో వేచిచూడాలి మ‌రి.!! ప్ర‌కాష్‌రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో ఇప్ప‌టికే నామినేష‌న్లు వేశారు. మంచు విష్ణు వ‌ర్గం ఇంకా నామినేష‌న్లు స‌మ‌ర్పించ‌లేదు. అక్టోబ‌రు ప‌దోతేదీన ఎన్నిక జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ స్కూల్‌లో జ‌రిగే ఓట్ల ప్ర‌క్రియ అనంత‌రం విజేత‌ను కూడా అదేరోజు ప్ర‌క‌టించ‌నున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

maa