టాలీవుడ్ కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మరో  పదేళ్ళు గిర్రున తిరిగితే చాలు టాలీవుడ్ కి వందేళ్ళు పూర్తి అవుతాయి. టాలీవుడ్ ని ఎందరో తీర్చిదిద్దారు. ఎన్నెన్నో మరపురాని కళాఖండాలు వచ్చాయి.


అటువంటి టాలీవుడ్ గత కొన్నేళ్ళుగా సరైన హిట్లు లేక సతమతమవుతోంది. అంతే కాదు, మంచి కధలను తెరకెక్కించలేకపోతున్నారు. రీమేక్స్ మీదనే బడా హీరోలు కూడా దృష్టి పెట్టి పెద్ద తప్పులే చేస్తున్నారు. దీని వల్ల నటుల అసలైన టాలెంట్ బయటకు రావడం లేదు. అక్కడ హిట్ అయింది కదా అని రీమేక్ తీస్తున్నారు. ఇక ఇపుడు అంతా ఓటీటీ యుగం, పైగా స్మార్ట్ ఫోన్ల యుగం. ఒక సినిమా రిలీజ్ అయితే ఏ దేశంలో ఉన్నా ఏ భాషలో తీసినా చూసేస్తున్నారు. అలాంటపుడు వాటిని పట్టుకుని రీమేక్స్ తీస్తే తెలుగు ఆడియన్స్ కి చూసేందుకు ఆసక్తి ఏముంటుంది.


ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మంచి నటనను కనబరచే సత్తా ఉన్న హీరోలు ఉన్నా కూడా సరైన కధలు మాత్రం వెలుగు చూడడంలేదు. అంతే కాదు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మంచి కధలు వస్తున్నాయి. ఎన్నో సమస్యల మీద సినిమాలు తీయవచ్చు. ఒకపుడు అంటే స్వర్ణ యుగంలో ఎన్టీయార్ ఏయన్నార్ వంటి వారు వాటిని చేసేవారు. రైతు కధలతో పాటు మహిళా కధాంశాలు కూడా అప్పట్లో సినిమాలుగా వచ్చేవి. అలాగే యువతరాన్ని పట్టి పీడించే సమస్యల మీద కూడా సినిమాలు తీసేవారు.


ఆఫ్ బిట్ మూవీస్ తో పాటు ఆలోచనత్మాకమైన చిత్రాలు కూడా నాడు అనేకం వచ్చేవి. ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగు సినిమా అన్ని రుచుల చక్కని విందు భోజనంగా ఉండేది. ఇపుడు మాత్రం చెప్పుకోవడానికి ఏముంది అన్న నిట్టూర్పులే ఉన్నాయి. చిన్న సినిమాలకు పెద్దగా   వర్కౌట్ కావడం లేదు. పెద్ద సినిమాలు కూడా ఎక్కువగా రీమేక్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. దీంతో మళ్ళీ ఆనాటి స్వర్ణ యుగం వస్తుందా అన్నదే అందరి బాధగా ఉంది. తెలుగు సినిమా బాగుండాలి అంటే చిన్న సినిమా బతకాలి అన్న మాట వినిపిస్తోంది. ఆ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే తప్ప అడుగు ముందుకు పడదు అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: