సినిమాలంటే చాలా మందికి పిచ్చి. చూడటమే కాదు.. సినిమాల్లో హీరో, హీరోయిన్ల నటన.. ఫైట్లు.. డ్యాన్స్ లు చూసి కొందరు ఇన్ స్పైర్ అవుతారు. వెండితెరపై కనిపించే వాళ్లను చూసి.. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఆ విధంగా అయితే ఎంత బాగుంటుందని ఫీలవుతున్నారు. తమ కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు. కొందరైతే ఇంట్లో చెప్పాపెట్టకుండా హైదరాబాద్, చెన్నైలకు వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే వారు కూడా ఉన్నారు. అలా వచ్చిన వారిలో కొందరు హీరో, హీరోయిన్లుగా.. విలన్లుగా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా.. జూనియర్ ఆర్టిస్టులుగా..అవకాశం సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే తమ ప్రయత్నాలు ఫలించక నిరాశతో వెనుదిరుగుతూ ఉంటారు.  

అంతేకాదు డైరెక్టర్ గా తమ ప్రతిభ చాటాలని కొందరు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం సంపాదించుకొని ఆ పనిలో రాటు దేలుతారు. అలా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది తమ ప్రతిభను చాటి గురువును మించిన శిష్యులిగా ఎదిగిన వారున్నారు. అందులో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. రామ్ గోపాల్ వర్మ దగ్గరి నుంచి చాలా మెళకువలు నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా ఎదిగారు. ఆ ఊపుతోనే పవన్ కళ్యాణ్ తో బద్రి చిత్రం తీశారు. సూపర్ డూపర్ హిట్ కొట్టి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరొందారు. బద్రి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రవితేజతో సినిమా ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నేనింతే, మహేశ్ బాబు పోకిరి, బిజినెస్ మాన్, నాగార్జునతో శివమణి, రామ్ చరణ్ తో చిరుత, ఎన్టీఆర్ తో టెంపర్, ప్రభాస్ తో బుజ్జిగాడు లాంటి చిత్రాలు చేసి టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.

పూరీ జగన్నాథ్ ఒక దర్శకుడే కాదు.. నిర్మాతగా, రచయితగా రాణిస్తున్నారు. నేనింతే చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారం కూడా అందుకున్నారు. అంతేకాదు యువదర్శకులను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేశారు. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ తీసుకొచ్చారు. పూరీ టాకీస్ బ్యానర్ పై హార్ట్ అటాక్ అనే చిత్రాన్ని రూపొందించారు. మరోవైపు తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాలను కూడా తీశారు. అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగ తేరా బాప్ తెరకెక్కించారు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఎంతో ఘనత సాధించారు పూరీ జగన్నాథ్.



మరింత సమాచారం తెలుసుకోండి: