దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుద‌లైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం అందుకోలేకపోయింది. తమిళనాట ఈ సినిమాను ప్రేక్షకులు అస‌లు పట్టించుకోలేదు. విజయేంద్రప్రసాద్ లాంటి రైట‌ర్  ఉన్నప్పటికీ సరైన ఎలివేషన్స్ లేవని, కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా తీశారంటూ విమర్శలు వ‌చ్చాయి.

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లా లేదు
జయలలిత బయోపిక్‌లా లేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వ‌చ్చాయి. ఈ సినిమా విషయంలో విజయేంద్రప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని, సినిమాలో ఆయన రాసిన చాలా సన్నివేశాలను పక్కన పెట్టేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. విజయేంద్రప్రసాద్ కాకుండా.. దర్శకుడు విజయ్ మరికొంత మంది రైటర్లను పెట్టుకొని విభిన్న‌మైన స‌న్నివేశాల‌ను రాయించుకున్నాడట. దీంతో సినిమా విడుదలైన రోజే దర్శకనిర్మాతలతో విజయేంద్రప్రసాద్ తన అసంతృప్తిని వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. కంగ‌నా ర‌నౌత్‌కు చెప్పిన స‌న్నివేశాలు వేర‌ని, తీసేట‌ప్పుడు కొన్ని మారాయంటున్నారు. సినిమా నిర్మాణం పూర్తిచేసుకున్న త‌ర్వాత దీనిపై కంగ‌న కూడా తీవ్ర‌స్థాయిలో అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

తిరుగుతూనే ఉన్న వివాదాలు
సినిమా చుట్టూ చాలా వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు విజయ్ పై సీరియ‌స్‌గా ఉన్నారని సమాచారం. అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయలేకపోవడం, ఇప్పుడు ఆశించిన స్థాయిలో లాభాలు కూడా రాకపోవడంతో.. విజయ్ కి ఇచ్చిన పారితోషికంలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునేలా నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయినా సినిమా తీసేట‌ప్పుడే నిర్మాత‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ద‌ర్శ‌కుడిపై పూర్తిగా భారం వేస్తే ఇలానే ఫ‌లితం ఉంటుంద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. ముందుగా ఒక స్క్రిప్ట్ అనుకున్న‌ప్పుడు ఆ ప్ర‌కార‌మే సినిమా నిర్మాణం ఉండాల‌ని, అలా కాకుండా మ‌ధ్య‌లో మారుస్తుంటే ఫ‌లితం ఇలానే ఉంటుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: