జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం తీవ్ర‌స్థాయికి చేరింది. స‌న్నాసి నుంచి మొద‌లైన వీరి వ్యాఖ్య‌ల ప‌రంపర‌.. కుక్క‌లు.. పందుల వ‌ర‌కు చేరింది. ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత‌గా రాజ‌కీయాల‌కు వేడెక్కించారు. ఇటు మంత్రి పేర్ని నాని, అటు ప‌వ‌న్ మ‌ధ్య మాటల యుద్ధం  కూడా తెర‌మీద‌కి వ‌చ్చింది. అయితే.. ప‌వ‌న్ ఎత్తుకున్న కీల‌క విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేయ‌డం.. ప్ర‌భుత్వ‌మే వాటిని విక్ర‌యించ‌డం. దీనిని క‌దా.. ప‌వ‌న్ వ్య‌తిరేకించిం ది. స్థూలంగా చూస్తే.. విష‌యం ఇదే! దీనికి ప‌వ‌న్‌లోని కొంత ఆవేశం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయాల‌నే స‌హ‌జ ప్ర‌తిప‌క్ష ల‌క్ష‌ణం క‌ల‌గలిసి.. విష‌యాన్ని తీవ్ర‌త‌రం చేశాయి.

స‌రే.. ఇందులోని తీవ్ర‌త‌ను ప‌క్క‌న పెట్టినా.. విష‌యాన్ని అంటే.. ఆన్‌లైన్ టికెట్ల విక్ర‌యాన్ని... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా ప్ర‌స్తావించిఉంటే బాగుండేద‌నే అభిప్రాయం సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది. కానీ, చంద్ర‌బాబుకానీ.. ఆ పార్టీ యువ నాయ‌కుడు.. లోకేష్ కానీ.. ఇత‌రులు కానీ.. పార్టీని స‌మ‌ర్ధించే... సినీ ఇండ‌స్ట్రీ కానీ.. ఎవ‌రూ స్పందించ‌లేదు. నాలుగు రోజులుగా ఇంత జ‌రుగుతున్నా.. టీడీపీ త‌ర‌ఫున ఒక ఖండ‌న కానీ.. లేదా.. ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు కానీ.. లేదా.. ఈ విష‌యంలో కీల‌క‌మైన పాయింట్ ఆన్‌లైన్ టికెట్ల విష‌యాన్ని కానీ ప్ర‌స్తావించ‌లేదు. దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు చంద్ర‌బాబు, లోకేష్‌బాబులు సైలెంట్‌గా ఉన్నారు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటు న్నారు. ఒక‌టి.. చంద్ర‌బాబు హ‌యాంలో సినిమా ఇండ‌స్ట్రీకి రాష్ట్రంలో పెద్ద పీట వేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆగిపోయిన నంది అవార్డుల ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించారు. చాలా సినిమాల‌కు వినోద‌పు రాయితీలు ఇచ్చారు. ఇంకొన్ని సినిమాలకు సెస్సు తీసేశారు. అంటే.. బాబు హ‌యాంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ బాగా న‌డిచింది. అంతేకాదు.. రాజ‌ధానిలోనూ సినివ‌ర్గాల‌ను పాత్ర‌ధారుల‌ను చేశారు. రాజ‌ధాని ప్లాన్ కోసం.. రాజ‌మౌళి వంటివారిని ఏపీకి తీసుకువ‌చ్చి.. చ‌ర్చించారు. అంటే.. బాబు హ‌యాంలో ఎంతో ల‌బ్ధి పొందిన సిని ప‌రిశ్ర‌మ‌.. గ‌త ఎన్నిక‌ల్లో.. త‌న విజ‌యం కోసం ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌లేద‌నే భావ‌న బాబులో ఉంది.

అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ప‌డుతున్న ఇబ్బందులు స్వ‌యంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు తెలియాల‌ని కూడా.. బాబు అనుకుంటున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం జ‌గ‌న్ కార‌ణంగా ఇండ‌స్ట్రీకి జ‌రుగుతున్న డ్యామేజీ వారికి తెలియాల‌ని.. ఇప్పుడు తాను జోక్యం చేసుకుంటే.. పెయిన్ క‌నిపించ‌ద‌నే భావ‌న‌తోనే చంద్ర‌బాబు ఉన్నార‌ని అంటున్నారు. అందుకే.. ఆయ‌న కానీ.. పార్టీ నాయ‌కులు కానీ ఎక్క‌డా ప‌న్నెత్తు మాట అన‌డం లేదేని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: