ఎస్పీ బాలు అంటేనే గాన గంధర్వుడు అని అంతా కొనియాడుతారు. బాలు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టం. ఒక ఘంటసాల పీబీ శ్రీనివాస్ వంటి ఉద్ధండులు తెలుగు సినీ రంగంలో ఉన్న రోజుల్లో బాలు చిత్ర సీమకు వచ్చి తనకంటూ ఒక విలువ గౌరవం సంపాదించుకున్నారు.

అంతే కాదు ఘంటసాల బాలు తెలుగు సినీ నేపధ్య సంగీతానికి రెండు కళ్ళు అన్నట్లుగా నిలిచారు. ఇక ఘంటశాలను అనుకరించి ఎందరో గాయకులు ఇండస్ట్రీకి వచ్చారు. వారు తమ ప్రతిభా పాటవాలతో కొన్నాళ్ళు పాడారు కూడా. అయితే ఎపుడూ అనుకరణ అనుకరణే. అందుకే వారు రాణించలేకపోయారు. అలాగే బాలును కూడా అనుసరించి అనుకరించి ఎందరో గాయకులు వచ్చారు. బాలు గాయకుడు అయ్యాక ఆయన స్టైల్ ని పట్టుకుని ఎందరో ఇండస్ట్రీకి వచ్చారు.

వారిలో జి ఆనంద్ ఒకరు. ఆయన 1974లో పండంటి కాపురం మూవీ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన పాడితే బాలు లాగానే ఉంటుంది అన్నది అంతా అప్పట్లో భావించారు. ఆ తరువాత మాధవపెద్ది రమేష్ కూడా బాలు లాగానే కొన్ని గీతాలు పాడి మెప్పించారు. ఇక 1980 దశకంలో రాజ్ సీతారామ్ అచ్చు బాలు లాగానే పాడుతారు అని పేరు తెచ్చుకున్నారు. ఆయనను సూపర్ స్టార్ క్రిష్ణ ప్రోత్సహించారు. అదే విధంగా మనో కూడా బాలు వాయిస్ తోనే ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. ఆయన పాడితే బాలు లాగానే ఉంటుంది అని అందరి చేత అనిపించుకున్నారు.

ఇక వీరందరి కంటే కూడా నిన్నే పెళ్ళాడుతా మూవీ ద్వారా ఎటో వెళ్ళిపోతుంది మనసు అన్న పాటతో బాలుయే మైమరచిపోయేలా పాడిన గాయకుడు రాజేష్. అచ్చు తనలాగే పాట పాడిన రాజేష్ అంటే బాలుకు ప్రత్యేక అభిమానం కూడా ఉండేది. ఏది ఏమైనా బాలు గొంతుకు దగ్గరగా ఎంతమంది గాయకులు వచ్చినా ఆయన వైవిద్యం వేరు. ఆయన విధానం వేరు. బాలు ఒక్కడే ఎప్పటికీ సినీ నేపధ్య సంగీతానికి అన్నది మాత్రం అక్షర సత్యం. బాలు కూడా ఎపుడూ అనుకరణను ప్రోత్స‌హించేవారు కాదు. మీరు మీలా పాడండి అంటూ పాడుతా తీయగాలో ఆయన  వర్ధమాన గాయకులకు చెప్పేవారు.




మరింత సమాచారం తెలుసుకోండి: