ఎంతో ఉత్కంఠ రేపిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ( మా ) ఎన్నిక‌లు ముగిశాయి. మా ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ప్ర‌చారంలో రెండు ఫ్యానెల్స్ వ్య‌వ‌హ‌రించిన తీరు, వాడిన భాష‌, ప్రెస్ మీట్ల తోనే చాలా వ‌ర‌కు సినిమా వాళ్ల‌పై తెలుగు జ‌నాల‌కు ఉన్న గౌర‌వం పోయింది. మా ప్ర‌తిష్ట దిగ‌జారింది. చివ‌ర‌కు ఈ పోరులో సీనియ‌ర్లు స‌పోర్ట్ చేసిన మోహ‌న్ బాబు కుమారుడు మంచు విష్ణు విజ‌యం సాధించారు. మెగా కాంపౌండ్ స‌పోర్ట్ చేసింద‌ని ముందు నుంచి ప్ర‌చారం ఉన్న సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయారు.

ఇక్క‌డితో మా రచ్చ ఆగిపోయి ఉంటే బాగుండేది. గ‌తంలో మా ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ‌రికి వారు రెండు ఫ్యానెల్స్ లో గెలిచిన వారు ఒక్క‌టే టీం గా ఏర్ప‌డి ఒకే మాట‌.. ఒకే బాట అన్న‌ట్టుగా క‌లిసి మెలిసి ప‌నిచేసే వారు. .ఇండ‌స్ట్రీ బాగు కోరుకునే వారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా .. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన ఓడిపోయిన వ్య‌క్తి ఫ్యానెల్లో ఉన్న వారు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం అనే చెత్త సంస్కృతికి తెర‌లేపారు. వారు ప్ర‌తిప‌క్షంలో ఉండి.. గెలిచిన ఫ్యానెల్ తాము ఇచ్చిన హామీలు అమ‌లు చేసేలా చూస్తే ప్ర‌తిప‌క్షంలో గెలిచిన వారు త‌మ ప‌ద‌వుల‌కు న్యాయం చేసిన వారు అయ్యే వారు.

అలా కాకుండా.. త‌మ ప్యానెల్ విజ‌యం సాధించ‌లే దు కాబ‌ట్టి.. తాము కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తామ‌ని అన‌డంతో వారిని ఓట్లేసి గెలిపించిన వారిని అవ‌మాన ప‌రిచిన‌ట్టే అయ్యింది. ఇక అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌కాష్ రాజ్ తాను అతిథిగా వ‌చ్చాను.. అతిథిగా ఉండ‌మ‌ని మా ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు... అలాగే ఉంటాన‌ని చెప్పి ఇప్పుడు రాజీనామాలు అంటూ కొత్త డ్రామాలు మొద‌లు పెట్ట‌డంపై కూడా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌కాష్ రాజ్ మాను నిట్ట‌నిలువునా చీల్చేందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చాడా ? అంటూ కొంద‌రు ఘాటుగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

దీని వెన‌క ఉన్న ఎజెండా ఏంటి ?   తెలుగు సినీ జ‌నాల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టి, వైష‌మ్యాలు పెంచేసి.. వారు ఇక ఇప్ప‌ట‌కీ క‌ల‌వ‌కుండా చేసే కుట్ర జ‌రుగుతుందా ? అన్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఈ కొత్త రాజీ డ్రామాల‌పై వ‌స్తోన్న సందేహాల‌కు ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో ?  కాల‌మే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: