పట్టుబట్టి మా ఎన్నికల్లో ఘ‌న విజయం సాధించిన మంచు మోహన్ బాబు కుటుంబానికి ఓ బలమైన వర్గం నుంచి మద్దతు లభించదని స్ప‌ష్ట‌మైపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారందరూ రాజీనామా చేశారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకే  ఇలా ప్రకటించార‌ని, ఇదంతా వ్యూహాత్మకమేనంటున్నారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను రెండు సంవ‌త్స‌రాల్లో అమలు చేయాల్సి ఉంటుంది. సొంత ఖర్చులో మా బిల్డింగ్ కట్టిస్తామని ప్ర‌క‌టించిన విష్ణు దానికోసం కొన్ని కోట్లరూపాయ‌ల‌ను భ‌విష్య‌త్తులో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

విష్ణు సంక్షేమ ప‌థ‌కాలు
ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌లు సంక్షేమ పథకాలను కూడా మంచు విష్ణు ప్రకటించారు. వాటిని అమలు చేయాలంటే భారీగా నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయి. విష్ణు గెలుపొందిన త‌ర్వాత మోహన్ బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సమస్యలు పరిష్కార‌మ‌వ్వాలి అంటే ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మోహన్ బాబుకు ఇది అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే ఇప్పటికే “మా”లో చీలిక వ‌చ్చింది. ఎవ‌రూ కలిసి వచ్చే అవకాశం క‌న‌ప‌డ‌డంలేదు. మోహన్ బాబు చేపట్టే కార్యక్రమాలకు వారు హాజరు కారు.

కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకారు
“మా”కు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ వల్ల నిధులు స‌మ‌కూర‌తాయి. రెండు వర్గాలుగా విడిపోయిన తెలుగు ప‌రిశ్ర‌మ నటులు కలసి కట్టుగా ఈ ప్రోగ్రామ్స్ చేయ‌డం క‌ష్టం. ప్రోగ్రామ్స్ పెట్టినా స్టార్ క‌థానాయ‌కులు రారు. అందుకే మా ఆధ్వర్యంలో ఈవెంట్స్ జ‌ర‌గ‌డం క‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. అవి జరగకపోతే మాకు నిధులు రావు. మోహన్ బాబు ముందున్న అసలు సమస్య ఏమిటంటే అంద‌రినీ క‌లుపుకొని వెళ్ల‌డంత‌ప్ప వేరే మార్గం లేదు. ఆ విషయంలో ఆయన ఎంత విజ‌య‌వంత‌మ‌వుతారో అనే దాన్నిబట్టే “మా” భవిష్యత్ కూడా ఆధార‌ప‌డివుంటుంది.


వీరంద‌రికీ స్థాయి, హోదా ముఖ్యం. అవి లేకుంటే అడుగు ముందుకు ప‌డ‌దు. గెలిచిన‌వారుకానీ, ఓడిన‌వారుకానీ ఎన్నిక‌ల‌కు ముందు ఒక‌లా, ఎన్నిక‌లైన త‌ర్వాత మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటివారు పేద క‌ళాకారుల‌కు ఏం చేస్తారు?  వారిని వారు ఉద్ధ‌రించుకోవ‌డానికి, ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తిపోసుకోవ‌డానికే స‌మ‌యం స‌రిపోవ‌డంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa