టాలీవుడ్ లో వచ్చే ఏడాది సంక్రాంతికి కనీవినీ ఎరుగని రీతిలో సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. అగ్ర హీరోలు అందరూ సంక్రాంతికే తమ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ముందుగానే రిలీజ్ డేట్స్ ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్, సర్కార్ వారి పాట, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్న ట్లు తెలిపారు మేకర్స్. అయితే వీటన్నిటి కన్నా ముందే సంక్రాంతి బరిలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఇది. సాగర్ కే చంద్ర  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ స్పందనను కనబరిచాయి. మరోవైపు ఇటీవల 'వకీల్ సాబ్, సినిమా హిట్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతుండటంతో 'భీమ్లా నాయక్' రేసులో వెనక్కి తగ్గింది అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై సినిమా నిర్మాత నాగ వంశీ స్పందించారు. "భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ అల్టిమేట్ క్లాస్ తో జనవరి 12న బిగ్ స్క్రీన్ వెలిగిపోతోంది" అంటూ ట్వీట్ చేశారు. దీంతో భీమ్లా నాయక్ వెనక్కి తగ్గుతోంది అన్న వార్తలపై చెక్ పడినట్లయింది. 

ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నా వాళ్లలో ఓ భయం మాత్రం అలాగే ఉండిపోయింది. సంక్రాంతి బరిలో ఇన్ని భారీ ప్రాజెక్టుల మధ్య ఈ రీమేక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సంక్రాంతి పోటీలో తగ్గేదే లేదు అంటూ వెనక్కి తగ్గని 'భీమ్లా నాయక్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ రానా సరసన సంయుక్త మీనన్  కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు...!!మరింత సమాచారం తెలుసుకోండి: