తెలుగు సినిమా కళామతల్లికి ఇద్దరు ముద్దు బిడ్డలు. వారు నేపధ్య సంగీతానికి తమ గళాన్ని వరంగా ఇచ్చి చిరంజీవులు అయ్యారు. ఒకరు ఘంటసాల అయితే మరొకరు ఎస్పీబీ. ఈ ఇద్దరూ ఇద్దరే. ఘంటసాల ఒరవడి వేరు, బాలూ స్వర సుడి వేరు. అయితేనేమీ ఈ ఇద్దరూ తెలుగు చిత్ర సీమను కొన్ని దశాబ్దాల పాటు శాసించారు, శ్వాసించారు.

ఘంటసాల 1940 దశకంలో చిత్ర సీమలో ప్రవేశించారు. ఆయన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న తరువాత 1950 ప్రాంతానికి పూర్తిగా నిలదొక్కుకున్నారు. ఆయన పాట లేని తెలుగు  సినిమా నాడు లేదు అంటే అతిశయోక్తి కాదు, ఒక వైపు స్వరం, రెండవ వైపు సంగీతం ఇలా ఘంటసాల దివ్యంగా రాణించారు. ఘంటసాల మంచి జోరు మీద ఉన్న టైమ్ లోనే అంటే 1966లో ఎస్పీబీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన తొలిపాట శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న మూవీలో అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత బాలూ వెనక్కు చూసుకోలేదు. ఆయన ఎన్నో పాటలు పాడుతూ తన లేత గొంతులో గమ్మత్తుని శ్రోతలకు అలవాటు పడేలా చేసుకున్నారు.

ఇక బాలు గాయకుడిగా పరిచయం అయిన మూడేళ్ళలోపే దిగ్గజ గాయకుడు ఘంటసాలతో కలసి పాటలు పాడడం విశేషం. ఘంటసాల సైతం బాలు ప్రతిభను చూసి మురిసిపోయేవారు. ఘంటసాల విజయనగరంలో ఒక సంగీత కచేరీ కార్యక్రమానికి వచ్చినపుడు ఆయన్ని అక్కడ ఉన్న వారు కొందరు ఒక ప్రశ్న అడిగారట. మీరు ఉద్ధండ గాయకులు, మీ తరువాత సినీ రంగానా వారసుడిగా ఎవరి పేరుని  చెబుతారు అంటే ఠక్కున బాలు అని ఘంటసాల జవాబు చెప్పారట. నిజానికి ఆ టైమ్ లో బాలు గాయకుడిగా వచ్చి కొద్ది ఏళ్ళు మాత్రమే  అయింది. అయినా సరే ఆయన బాలు పేరుని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరచిందిట.

దానికి కారణం కూడా ఉందని అంటారు. ఘంటసాల బాలు గురించి తన సన్నిహితులతో మాట్లాడుతూ బాలు ఏ పాట అయినా ఇట్టే పాడేస్తాడు. అనుకరించడు, మంచి ప్రతిభ ఉంది అంటూ పొగిడేవారుట. అంతే కాదు తాను సంగీత దర్శకత్వం వహించిన అనేక చిత్రాలలో కూడా బాలూ చేత ఆయన పాటలు పాడించారు. మొత్తానికి ఘంటసాల వంటి వారి దీవెనలు కూడా ఉన్నాయి కాబట్టే బాలూ ఏకంగా నలభై వేల పై చిలుకు పాటలు పాడి భారీతీయ రత్నంగా మెరిసారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

sbp