ఏపీ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం.. టాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. ఈ చట్ట సవరణ ద్వారా అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు అగ్రహీరోలకు, అగ్ర దర్శకులకు, భారీ బడ్జెట్ సినిమాలకు చాలా నష్టదాయకం అన్న వాదన వినిపిస్తోంది. వందల కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తీసేవాళ్లకు ఇక తమ పెట్టుబడి రాబట్టుకోవడం గగనమవుతోందన్న వాదన వినిపిస్తోంది.


మరి జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికి లాభం.. ఎవరి కోసం జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ ప్రశ్నలకు వినిపించే సమాధానమే సామాన్యుడు.. అవును.. ఈరోజుల్లో ఎవరైనా ఓ కొత్త సినిమాను ధియేటర్‌లో చూడాలనుకుంటే.. మొదటి రెండు, మూడు వారాలు ఆగాల్సిందే. ఎందుకంటే పెద్ద సినిమాలన్నీ మొదటి రోజుల్లో బెనిఫిట్ షోలు రన్ చేస్తాయి. ఈ బెనిఫిట్ షోల్లో టికెట్ ధరలు అసలు ధరలకు చాలా రెట్లు ఉంటాయి.


అంతే కాదు.. బెనెఫిట్ షోల కారణంగా రోజులో మొత్తం షోల సంఖ్య పెరుగుతుంది. రోజుకు 6 షోలు వేసేవారు కొందరైతే.. 8 షోలు రన్ చేసే వారూ ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలకు రావాల్సిన కలెక్షన్ మొత్తాన్ని తొలిరోజుల్లోనే వసూలు చేసుకోవాలన్నది ప్రస్తుతం టాలీవుడ్‌ అనుసరిస్తున్న సూత్రం. అందుకే బెనెఫిట్ షోలకు అనుతి తీసుకుంటారు. ఇక టికెట్ రేటు సైతం అడ్డగోలుగా పెంచేస్తారు. అదేమంటే.. అంత డబ్బు పెట్టకపోతే.. తర్వాత చూసుకోవోయ్.. తొందరేంటి అని వాదిస్తారు కూడా.


అయితే ఈ కొత్త సినిమా చట్టం సవరణ కారణంగా ఇప్పుడు ఈ గోల ఉండదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. కేవలం నాలుగు ఆటలే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టికెట్ ధరలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి తప్పించి తరచూ మారేలా ఉండవు. అలాగే సామాన్యుడికి బ్లాక్ టికెట్ల గోల ఉండదు. ఆన్ లైన్ టికెటింగ్ కాబట్టి పారదర్శకత కూడా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: