ఆయనకు కవిత్వం ఒక వ్యసనం. బాల్యం నుంచే అలా అక్షరాలను పట్టుకుని రాస్తూనే ఎదిగారు, ఎన్నో శిఖరాలను తాకారు. అలా రాస్తూనే అదే పనిలో తుది శ్వాస వదిలారు. కొత్తగా ఆలోచించడం, జీవిత గమనంలో వచ్చే మలుపులు, మెరుపులు, మరకలు అన్నీ కూడా జాగ్రత్తగా గుది గుచ్చి పాటగా మార్చడం ఆయనకే చెల్లు. ఆయనే సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన తెలుగు సినిమా పాటకు కొత్త ఒరవడి తెచ్చారు.

తెలుగు సినిమా పాట గౌరవాన్ని పెంచారు. ఇది సినిమా పాట అని తేలిక చేసి మాట్లాడేవారికి అందుకోని భాషా సౌందర్యాన్ని చూపించారు. అందులోని అర్ధాన్ని, పరమార్ధాన్ని కూడా వివరించగలిగారు. తెలుగు సినిమా పాటకు ఉన్న శక్తిని కూడా లోకానికి చాటారు. పాటకు ఉన్న పవర్ ఎంతో శాస్త్రి గారి కలం అందరికీ చూపించింది.

తెలుగు సినిమా పాట ఎందరో కవుల చేతుల్లో లాలించి పాలించబడింది. అలనాటి కవులు పింగలి, దేవులపల్లి, మల్లాది లాంటి వారి నుంచి ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, డాక్టర్ సి నారాయణరెడ్డి, దాశరధి లాంటి వారి దాకా సాగుతూ వచ్చింది. అందమైన పాటల రూపంలో హాయిగా పరవశించింది.

అటువంటి పాటకు మరింత శోభను అద్దుతూ సీతారామశాస్త్రి తన వంతుగా సాహితీ కృషి చేశారు. ఆయన చేసిన అక్షర సేద్యానికి ఎన్నో గీతాలు అపురూపమైన పంటలుగా బయటకు వచ్చాయి. తెలుగు సినిమా పాట స్థాయి ఇదీ అని చాటిన కవులలో వేటూరి తరువాత చెప్పుకోవాల్సింది సీతారామశాస్త్రినే. ఆయనను ఒక విధంగా చిట్ట చివరి కవిగా కూడా చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటే సొంతంగా తమదైన  భావాన్ని, భాషను అద్ది తెలుగు పాటను తీర్చిదిద్దిన వారిలో పూర్వీకులు ఉంటే సీతారామశాస్త్రి వారి సరసన చేరే స్థాయి సత్తా కలిగిన వారు అని చెప్పడమే. ఆయనతో ఒక శకం ముగిసింది అనే కంటే ఆయన వెంట తెలుగు సినిమా పాట వెళ్ళిపోయింది అనడం సబబుగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: